T20 League: వచ్చే భారత టీ20 లీగ్‌లో కామెరూన్ గ్రీన్‌కు భారీ డిమాండ్‌: ఆసీస్‌ కెప్టెన్‌

ఆసీస్‌ యువ ఆల్‌రౌండర్‌ కామెరూన్ గ్రీన్‌కు భారత టీ20 లీగ్‌లో భారీ డిమాండ్ ఉంటుందని ఆసీస్‌ టెస్టు జట్టు కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణిస్తూ కీలకంగా మారతాడని పేర్కొన్నాడు.

Published : 01 Oct 2022 01:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇటీవల భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆసీస్‌ బ్యాటర్‌ కామెరూన్ గ్రీన్‌ గుర్తుండే ఉంటాడు. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ రాణించాడు. మూడు మ్యాచుల్లోనూ ఓపెనర్‌గా వచ్చి రెండు అర్ధశతకాలు సాధించాడు. తొలి టీ20లో 209 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గ్రీన్‌ (61) కీలక పాత్ర పోషించాడు. రెండేళ్ల కిందట (2020) అరంగేట్రం చేసిన గ్రీన్‌.. ఇప్పటివరకు 14 టెస్టులు, 12 వన్డేలు, కేవలం నాలుగు టీ20లను మాత్రమే ఆడాడు. మొత్తం 1000కి పైగా పరుగులు సాధించాడు. టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్‌కు కీలక ఆటగాడిగా మారతాడనే అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో గ్రీన్‌ను వచ్చే భారత టీ20 లీగ్‌ చూడొచ్చని క్రికెట్ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఆల్‌రౌండ్‌ ప్రతిభ కలిగిన గ్రీన్‌కు మంచి ధర పలకవచ్చని పేర్కొన్నారు. తాజాగా ఆసీస్‌ టెస్టు జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఇదే విషయం చెప్పాడు.

‘‘మూడు ఫార్మాట్లలో కీలక ఆటగాడిగా గ్రీన్‌ ఎదుగుతున్నాడు. భవిష్యతుల్లోనూ ఎక్కువ టెస్టులు ఆడగల సామర్థ్యం ఉంది. అలాగే వచ్చే టీ20 ప్రపంచకప్‌లో ముఖ్య భూమిక పోషిస్తాడు. అందుకే భారత టీ20 లీగ్‌లో అతడికి భారీగా డిమాండ్‌ ఉంటుందని భావిస్తున్నా’’ అని ప్యాట్ కమిన్స్‌ వెల్లడించాడు. ముంబయి, హైదరాబాద్‌, చెన్నై ఫ్రాంచైజీలు గ్రీన్‌ను దక్కించుకొనేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే సీజన్‌ కోసం మినీ వేలం నిర్వహించాలని బీసీసీఐ యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ 15/16వ తేదీల్లో ఉండే అవకాశం ఉంది. అప్పుడే ఆటగాళ్లను ఫ్రాంచైజీలు మార్చుకొనే వెసులబాటును కల్పించనుందని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని