Pat Cummins: ఆసీస్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌కు మాతృవియోగం

ప్యాట్ కమిన్స్‌ (Pat Cummins) కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి మారియా కమిన్స్‌ కన్నుమూశారు. ఈ మేరకు క్రికెట్‌ ఆస్ట్రేలియా సంతాపం తెలియజేసింది.

Published : 10 Mar 2023 10:42 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత పర్యటన (IND vs AUS) నుంచి అర్ధంతరంగా స్వదేశానికి వెళ్లిన ఆస్ట్రేలియా టెస్టు జట్టు రెగ్యులర్‌ సారథి ప్యాట్ కమిన్స్‌కు (Pat Cummins) మాతృవియోగం కలిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్యాట్ కమిన్స్ తల్లి మారియా కమిన్స్‌ కన్నుమూసినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా పోస్టు చేసింది. ‘‘అనారోగ్యంతో బాధపడుతూ అర్ధరాత్రి సమయంలో మారియా కమిన్స్‌ కన్నుమూశారు. ఆస్ట్రేలియా క్రికెట్‌ తరఫున ప్యాట్‌ కమిన్స్‌కు సంతాపం తెలియజేస్తున్నాం. ఆసీస్‌ ఆటగాళ్లు సంతాప సూచికంగా నల్ల రిబ్బన్లను ధరిస్తారు’’ అని సీఏ తెలిపింది.

తన తల్లి అనారోగ్యం కారణంగానే భారత్‌తో రెండో టెస్టు ముగిసిన అనంతరం ప్యాట్‌ కమిన్స్‌ స్వదేశానికి వెళ్లిపోయాడు. మారియా కమిన్స్‌ 2005 నుంచి బ్రెస్ట్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. గత కొన్ని వారాలుగా వ్యాధి తీవ్రం కావడంతో ఆసుపత్రికి తరలించినట్లు ప్యాట్‌ కమిన్స్‌ అప్పట్లో తెలిపాడు. ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టెస్టుతోపాటు మూడో టెస్టుకూ ఆయన అందుబాటులో లేడు. అతడి స్థానంలో స్టీవ్‌ స్మిత్‌ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ప్యాట్‌ కమిన్స్‌ తల్లి మృతికి సంతాపంగా ఆసీస్‌ ఆటగాళ్లు నల్ల రిబ్బన్లతో రెండో రోజు ఆటను ప్రారంభించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని