Pat Cummins: వరుసగా రెండో హ్యాట్రిక్‌.. పాట్ కమిన్స్‌ ఆల్‌టైమ్‌ రికార్డు

ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్ టీ20 ప్రపంచ కప్‌లో ప్రత్యర్థులను వణికిస్తున్నాడు. తన పేస్‌తో వరుసగా వికెట్లు తీస్తూ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

Updated : 23 Jun 2024 08:58 IST

ఇంటర్నెట్ డెస్క్: ఒక్క మ్యాచ్‌లో వెంటవెంటనే మూడు వికెట్లు తీస్తే హ్యాట్రిక్‌ అవుతుంది. అది చాలా కష్టం. ఆ సందర్భాలు జరగడం చాలా అరుదు. అలాంటిది ఒకే టోర్నీలో వరుసగా రెండోసారి హ్యాట్రిక్‌ వికెట్ల ప్రదర్శన చేయడం మాత్రం అద్భుతమనే చెప్పాలి. ఈ ఘనతను ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ (Pat Cummins) సాధించాడు. టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) వరుసగా రెండోసారి హ్యాట్రిక్‌ తీసిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. తొలుత బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనతను సాధించగా.. తాజాగా అఫ్గానిస్థాన్‌పై మరో హ్యాట్రిక్‌తో అదరగొట్టేశాడు.

నాలుగోది మిస్‌.. 

అఫ్గానిస్థాన్‌ ఇన్నింగ్స్‌కు బ్రేక్‌ వేస్తూ కమిన్స్‌ (3/28) డెత్‌ ఓవర్లలో చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ చివరి బంతికి రషీద్ ఖాన్‌ను ఔట్ చేసిన కమిన్స్.. 20 ఓవర్‌ తొలి బంతికే కరీమ్‌ జనత్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత బంతికే గుల్బాదిన్‌ను కూడా ఔట్ చేశాడు. వీరందరూ క్యాచ్‌లు ఇచ్చి డగౌట్‌కు చేరారు. ఇదే ఓవర్‌ మూడో బంతికి అఫ్గాన్‌ బ్యాటర్ ఖరోటె ఇచ్చిన క్యాచ్‌ను డేవిడ్‌ వార్నర్ నేలపాలు చేశాడు. లేకపోతే వరుసగా నాలుగు వికెట్లు తీసిన ఘనత సాధించేవాడే. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.

మరికొన్ని విశేషాలు..

  • ఒకే వరల్డ్‌ కప్‌లో వరుసగా రెండుసార్లు హ్యాట్రిక్ సాధించిన తొలి ఆటగాడిగా పాట్ కమిన్స్‌ నిలిచిపోయాడు.
  • టీ20ల్లో ఇప్పటి వరకు రెండేసి హ్యాట్రిక్‌లను సాధించిన బౌలర్లు కమిన్స్‌ కాకుండా.. మరో నలుగురు మాత్రమే ఉన్నారు. లసిత్ మలింగ (శ్రీలంక), టిమ్‌ సౌథీ (కివీస్), మార్క్ పాల్వోవిక్ (సెర్బియా), వసీమ్ అబ్బాస్ (మాల్టా). 
  • టీ20 ప్రపంచ కప్‌ల్లో ఇప్పటి వరకు 8 హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి. అందులో కమిన్స్‌వే రెండు ఉన్నాయి. టీ20ల్లో ఆసీస్‌ తరఫున రెండు హ్యాట్రిక్‌లు తీసిన ఏకైక బౌలర్ కూడా కమిన్సే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని