Pele: నాన్నా ఏడవకు.. ప్రపంచకప్‌ నేను తెస్తాను..!

తండ్రి కన్నీరు చూడలేక.. నీ కోసం నేనే ప్రపంచకప్‌(FIFA World Cup) గెలుచుకొస్తా అని ఓ పదేళ్ల కుర్రాడు హామీ ఇచ్చాడు. ఆ తర్వాత ఎనిమిదేళ్లలోపే ప్రపంచకప్‌ను గెలుచుకొచ్చాడు.  

Updated : 30 Dec 2022 11:22 IST

‘నాన్నా ఏడవకు.. నీ కోసం నేను ప్రపంచకప్‌ (FIFA World Cup)తెస్తాను’ అని ఓ పదేళ్ల కుర్రాడు తండ్రిని ఓదార్చాడు. ఆ తర్వాత ఎనిమిదేళ్ల లోపే ఆ కుర్రాడు అన్నంత పనీ చేశాడు. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను తెచ్చి తండ్రి ముందుంచాడు. ఇదేదో సినిమా కథ కాదు. ఫుట్‌బాల్‌ స్టార్‌ పీలే(pele) జీవితంలో జరిగిన యథార్థ ఘటన. 1950 ప్రపంచకప్‌(FIFA World Cup) టోర్నీకి ఆతిథ్యమిచ్చిన బ్రెజిల్‌ ఫైనల్స్‌లో ఉరుగ్వే చేతిలో ఓడిపోయింది. దీంతో పీలే(pele) తండ్రి చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. ఆ సమయంలో పదేళ్ల వయసున్న పీలే(pele) తానే ప్రపంచకప్‌(FIFA World Cup)ను సాధిస్తానని తండ్రికి ధైర్యం చెప్పాడు. అక్కడ సీన్‌ కట్‌ చేస్తే..  1958 ప్రపంచకప్‌లో పీలే (pele)6 గోల్స్‌ సాధించి బ్రెజిల్‌ను విజేతగా నిలిపాడు. అప్పటికి పీలే వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. ఈ టోర్నీ ఫైనల్‌లో గోల్స్‌ చేసిన అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు. పీలే (pele) రాక ముందు వరకు 10 నంబర్‌ జెర్సీ ఒక అంకె మాత్రమే. కానీ, పీలే రాకతో క్రీడా ప్రపంచంలో ఆ జెర్సీ దశ తిరిగింది.

సాక్స్‌లో పేపర్లు నింపి..

1940లో జన్మించిన పీలే అసలు పేరు ఎడిసన్‌ అరాంట్స్‌ డో నాసిమియాంటో.. అమెరికా శాస్త్రవేత్త థామస్‌ ఆల్వా ఎడిసన్‌ పై ప్రేమతో ఆ పేరు పెట్టారు. పాఠశాలలో అతడికి ‘పీలే’ అనే నిక్‌ నేమ్‌ వచ్చి స్థిరపడిపోయింది. తన పేరు అర్థం తనకే తెలియదని ఓ సందర్భంలో పీలే వెల్లడించాడు. ఈ సాకర్‌ స్టార్‌ బాల్యం కడు పేదరికంలో సాగింది. చివరికి సొంతంగా ఫుట్‌బాల్‌ కూడా కొనుగోలు చేయలేని కుటుంబం అతడిది. దీంతో సాక్సులో పేపర్లు నింపి బంతిలా చేసి.. దానితోనే ఆడేవాడు. బాల్యంలో చాలా స్థానిక ఫుట్‌బాల్‌ క్లబ్‌ల తరపున ఆడాడు. ఈ క్రమంలో ‘రేడియం’ అనే స్థానిక ఇండోర్‌ ఫుట్‌బాల్‌(ఫుట్సల్‌) జట్టులో సభ్యుడయ్యాడు. 14 ఏళ్ల వయసులోనే సీనియర్లతో ఆడే అవకాశం లభించింది. కానీ, పీలే(pele) చిన్నకుర్రాడని అందరూ భావించారు. ఇండోర్‌ ఫుట్‌బాల్‌లో ఆటగాళ్లు చాలా దగ్గరగా ఉంటారు.. దీంతో మెరుపు వేగంతో ఆడాల్సి ఉంటుంది. ఈ దశలోనే పీలేలోని ఆటగాడు రాటుదేలిపోయాడు. ఆ ఏడాది పీలే జట్టు ఇండోర్‌ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌ షిప్‌ గెలుచుకొంది. ఆ టోర్నీలో పీలే(pele) దాదాపు 15 గోల్స్‌ చేశాడు.

1956లో చిన్ననాటి కోచ్‌ డి బ్రిటో.. పీలే(pele)ను శాంటోస్‌ నగర ఫుట్‌బాల్‌ క్లబ్‌కు పరిచయం చేశాడు. ఆ జట్టు తరపున 15 ఏళ్ల వయసులో తొలి లీగ్‌ మ్యాచ్‌ ఆడిన పీలే గోల్‌ చేశాడు. 1957 లీగ్‌ సీజన్‌లో ఏకంగా టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత బ్రెజిల్‌ జాతీయ జట్టు నుంచి పిలుపు వచ్చింది. 16 ఏళ్ల వయసులో ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే గోల్‌ చేశాడు. బ్రెజిల్‌ తరఫున అతిపిన్న వయసులో గోల్‌ చేసిన ఆటగాడు పీలే(pele)నే..!

మోకాలి గాయంతోనే తొలి ప్రపంచకప్‌..

1958 ప్రపంచకప్‌(FIFA World Cup)లో జట్టులో స్థానం దక్కించుకున్నాడు. కానీ, ఆతిథ్య స్వీడన్‌కు చేరుకునేసరికి మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. మూడో మ్యాచ్‌ సమయానికి పీలే (pele)కోలుకొని బరిలోకి దిగాడు. సోవియట్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో విన్నింగ్‌ గోల్‌కు అసిస్ట్‌ చేశాడు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో తొలి ప్రపంచకప్‌ (FIFA World Cup)గోల్‌ చేయగా.. సెమీస్‌లో ఏకంగా హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ నమోదు చేసిన కుర్రఆటగాడిగా రికార్డు సృష్టించాడు.  ఫైనల్స్‌లో రెండు గోల్స్‌ చేసి బ్రెజిల్‌ను విజేతగా నిలిపాడు. ఈ మ్యాచ్‌లో స్వీడిష్‌ డిఫెండర్‌ తలపై నుంచి బంతిని తప్పించి కొట్టిన గోల్‌.. ఫిఫా చరిత్రలోనే అత్యుత్తమైందిగా నిలిచింది. ఆ తర్వాత పీలే జైత్రయాత్రకు ఎదురు లేకుండా పోయింది.

1959 ఒక్క సంవత్సరంలోనే  అతడు 126 గోల్స్‌ కొట్టడం ఓ రికార్డు. మూడు ప్రపంచకప్‌(FIFA World Cup)లు అందుకొన్న ఏకైక ఆటగాడు పీలేనే. కెరీర్‌ మొత్తం (ఫ్రెండ్లీ మ్యాచ్‌లతో సహా)లో 1,363 మ్యాచ్‌లు ఆడి 1,281 గోల్స్‌ చేశాడు. పీలే(pele) సుదీర్ఘ కెరీర్‌లో మ్యాచ్‌లు.. గోల్స్‌ నిష్పత్తి 0.93..! ఇది మెస్సీ, రొనాల్డో కంటే చాలా ఎక్కువ. అధికారికంగా ఆడిన 831 మ్యాచ్‌ల్లో 767 గోల్స్‌ చేశాడు. మెస్సీ, రొనాల్డో ఇన్ని గోల్స్‌ చేయడానికి దాదాపు 1,000 మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు