Tokyo Olympics: దేశానికి పతకం తెస్తానని ముందే చెప్పింది

ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌కు చేరుకొని పతకాన్ని ఖాయం చేసుకుంది బాక్సర్‌ లవ్లీనా బొర్గొహైన్‌(23). ఆమె సెమీస్‌కు చేరుకోవడంతో అస్సాంలోని ఆమె కుటుంబసభ్యులపై అభినందనల వర్షం కురుస్తోంది....

Updated : 04 Aug 2021 08:24 IST

డిస్పుర్‌: ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌కు చేరుకొని పతకాన్ని ఖాయం చేసుకుంది బాక్సర్‌ లవ్లీనా బొర్గొహైన్‌(23). ఆమె సెమీస్‌కు చేరుకోవడంతో అస్సాంలోని ఆమె కుటుంబసభ్యులపై అభినందనల వర్షం కురుస్తోంది. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్‌ టర్కీకి చెందిన బుసేనాజ్ సుమెనెలితో లవ్లీనా బుధవారం సెమీస్‌లో పోరాడనుంది. ఈ నేపథ్యంలోనే లవ్లీనా తండ్రి స్పందించారు. ఆమె విజయం కోసం అస్సాం అంతా ప్రార్థిస్తోందని పేర్కొన్నారు.

దేశానికి ఒలింపిక్‌ పతకం తీసుకొస్తానని లవ్లీనాకు ఎంతో నమ్మకముండేదని.. ఆ విషయాన్ని నిజం చేసిందని బాక్సర్‌ తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. టోక్యోకు వెళ్లే ముందు కూడా ఆ విషయాన్ని తమతో పంచుకుందని.. పతకంతోనే తిరిగి ఇంటికి వస్తానని చెప్పినట్లు ఆయన వెల్లడించారు. లవ్లీనా బంగారు పతకం సాధించాలని తమతోపాటే గ్రామంలోని అనేక మంది ప్రార్థిస్తున్నారని.. కొందరు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

టోక్యో ఒలింపిక్స్‌లో లవ్లీనా బొర్గొహైన్‌ 69 కిలోల విభాగంలో అదరగొట్టింది. గత నెల 30న జరిగిన క్వార్టర్స్‌ పోరులో చైనీస్‌ తైపీకి చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్‌ నీన్‌-చిన్‌పై 4-1 తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌లో బెర్త్‌ ఖరారు చేసుకుంది. బుధవారం జరిగే సెమీస్‌లో గెలిస్తే ఫైనల్‌కు వెళ్తుంది. ఒకవేళ ఓడిపోయినా.. కనీసం కాంస్య పతకం దక్కుతుంది. లవ్లీనా కంటే ముందు విజేందర్‌సింగ్‌, మేరీకోమ్‌లు మాత్రమే బాక్సింగ్‌లో భారత్‌కు పతకాలు తెచ్చిపెట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని