WI vs ENG: విండీస్‌ను చితక్కొట్టి.. ఫామ్‌లోకొచ్చేసిన ఇంగ్లాండ్‌!

టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ దూకుడు మొదలైంది. సూపర్-8లో అతిథ్య విండీస్‌ను చిత్తు చేసి తొలి విజయాన్ని నమోదు చేసింది.

Updated : 20 Jun 2024 10:22 IST

ఇంటర్నెట్ డెస్క్: డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా టీ20 ప్రపంచ కప్‌ (t20 World Cup 2024) బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ అష్టకష్టాలు పడి సూపర్‌-8కి చేరింది. కానీ, ఈ దశలో తమ తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య వెస్టిండీస్‌ను చిత్తు చేసి ఘన విజయం సాధించింది. కీలక సమయంలో ఇంగ్లిష్‌ జట్టు ఆటగాళ్లు ఫామ్‌లోకి వచ్చారు. లీగ్‌ స్టేజ్‌లో ఎదురులేకుండా హవా కొనసాగించిన విండీస్‌కు అడ్డుకట్ట వేశారు. తొలుత ఆతిథ్య జట్టు 180/4 స్కోరు సాధించగా.. ఇంగ్లాండ్‌ అలవోకగా 17.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసి విజయం సాధించింది.

అదరగొట్టిన సాల్ట్, బెయిర్‌స్టో

వెస్టిండీస్‌ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్య ఛేదనను ఇంగ్లాండ్ ఘనంగా ప్రారంభించింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (87*: 47 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), బట్లర్ (25) తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించారు. అయితే, కొద్దిపాటి విరామంలోనే బట్లర్‌తోపాటు మొయిన్ అలీ (13) ఔట్ కావడంతో ఇంగ్లాండ్ అభిమానుల్లో కాస్త కలవరం రేగింది. అప్పటికి ఆ జట్టు స్కోరు 10.1 ఓవర్లకు 84/2. ఇంకా 65 బంతుల్లో 97 పరుగులు చేయాలి. ఆ సమయంలో సాల్ట్‌తో కలిసి జానీ బెయిర్ స్టో (48*: 26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) జత కలిశాడు. వీరిద్దరూ విండీస్‌ బౌలర్లను ఎడాపెడా బాదేయడంతో లక్ష్యం కరిగిపోయింది. మూడో వికెట్‌కు కేవలం 44 బంతుల్లోనే 97 రన్స్‌ భాగస్వామ్యం నిర్మించారు. దీంతో ఇంగ్లాండ్‌ కేవలం 2 వికెట్లను మాత్రమే కోల్పోయి 17.3 ఓవర్లలోనూ టార్గెట్‌ను పూర్తి చేసింది. విండీస్‌ బౌలర్లలో ఆండ్రి రస్సెల్, రోస్టన్ ఛేజ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. 

తలో చేయి వేసిన విండీస్ బ్యాటర్లు..

సొంత మైదానంలో వరల్డ్‌ కప్‌ జరుగుతుండటంతో విండీస్‌ ఆటగాళ్లు రెచ్చిపోతున్నారు. లీగ్‌ స్టేజ్‌లో భారీ స్కోర్లతో ప్రత్యర్థులను వణికించారు. ఇప్పుడు సూపర్-8లో భాగంగా మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఛార్లెస్ (38), పూరన్ (36), రోవ్‌మన్ పావెల్ (36), షెర్ఫానె రూథర్‌ఫోర్డ్ (28) విలువైన పరుగులు సాధించారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో ఆర్చర్, అదిల్ రషీద్, మొయిన్‌ అలీ, లివింగ్‌స్టోమ్ తలో వికెట్ తీశారు.

ఒకే ఓవర్‌లో 30 పరుగులు

విండీస్‌ బౌలర్ రొమారియో షెఫర్డ్ వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్‌ సాల్ట్ రెచ్చిపోయాడు. ఏకంగా 30 పరుగులు రాబట్టాడు. ఇందులో మూడు ఫోర్లు, మూడు సిక్స్‌లు ఉన్నాయి. ఈ ఒక్క ఓవర్‌తో ఇంగ్లాండ్‌ విజయం ముందే ఖరారైంది. కీలక ఇన్నింగ్స్‌ ఆడిన సాల్ట్‌కే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని