Hanuma Vihari: అలా చేస్తే నా కెరీర్‌లో రిస్క్‌లో పడుతుందని ఆయన చెప్పాడు: హనుమ విహారి

మధ్యప్రదేశ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్‌లో ఆంధ్రా కెప్టెన్‌ హనుమ విహారి (Hanuma Vihari) గొప్ప పోరాట పటిమ కనబరిచాడు. మణికట్టులో చీలిక వచ్చినా బ్యాటింగ్‌కు దిగి అభిమానులు నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

Updated : 05 Feb 2023 17:22 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల మధ్యప్రదేశ్‌తో రంజీ క్వార్టర్స్‌లో ఆంధ్ర కెప్టెన్‌ హనుమ విహారి (Hanuma Vihari) గొప్ప పోరాటం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. తొలి రోజు అవేశ్‌ విసిరిన బౌన్సర్‌ తగిలి మణికట్టులో చీలిక వచ్చి 16 పరుగుల వద్ద రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. జట్టుకు వీలైనన్ని పరుగులు అందించాలనే ఉద్దేశంతో చేతికి కట్టు ఉన్నా రెండో రోజు పదకొండో  స్థానంలో క్రీజులోకి వచ్చాడు. కుడిచేతి వాటం బ్యాటరైన అతను ఎడమచేతి వాటానికి మారి.. ఒక్క చేత్తోనే (కుడి) బ్యాటింగ్‌ కొనసాగించాడు. నొప్పి బాధిస్తున్నా జట్టు కోసం పోరాడాడు. 20 బంతులు ఎదుర్కొన్న అతను.. రెండు బౌండరీలూ కొట్టాడు. ముందు రోజు స్కోరుకు 11 పరుగులు జత చేసి చివరకు ఎల్బీగా వెనుదిరిగాడు. ఇలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని గొప్ప పోరాట పటిమను చూపిన విహారిపై అభిమానులతోపాటు పలువురు క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. కెరీర్‌ను రిస్క్‌లో పెట్టి ఇలా చేయడం సరికాదని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. జట్టు ఫిజియో కూడా విహారిని గాయంతో బ్యాటింగ్‌ చేసి కెరీర్‌ను ప్రమాదంలో పడేసుకోవద్దని హెచ్చరించాడట. ఈ విషయాన్ని విహారి ఓ టీవీ షోలో వెల్లడించాడు. 

‘నేను బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు.. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మళ్లీ చేతికి బంతి తగిలితే నా కెరీర్ ప్రమాదంలో పడుతుందని ఫిజియో నాకు 10 సార్లు చెప్పారు. ఈ మ్యాచ్ తర్వాత క్రికెట్ ఆడకుంటే ఇబ్బంది లేదని ఫిజియోకి చెప్పా. కానీ ఈ మ్యాచ్‌లో ఆంధ్రా కోసం ఆడకుంటే అది నా మనసును ఎప్పటికీ బాధిస్తుంది. ఆంధ్రాకు కీలకమైన ఈ మ్యాచ్‌లో నేను సరిగ్గా బ్యాటింగ్‌ చేయలేకపోయా. చివరి వికెట్‌కు 10-15 పరుగులు జోడించగలిగినా ప్రయోజనం ఉంటుందని భావించి ఆ నిర్ణయం తీసుకున్నా. జట్టు కోసం ఏదైనా చేయాలనుకునప్పుడు ధైర్యం వస్తుంది’ అని విహారి పేర్కొన్నాడు. టెస్టుల్లో టీమ్‌ఇండియా తరఫున అవకాశాలు రాకపోవడంతో కొంత నిరాశతో ఉన్నానని వివరించాడు. విహారి భారత్‌ తరఫున ఇప్పటివరకు 16 టెస్టులు ఆడి 33.56 సగటుతో 839 పరుగులు చేశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు