పీటర్సన్‌కు జాఫర్‌ దిమ్మతిరిగే పంచ్‌!

గెలుపు కోసం ఇరు జట్లు యుద్ధరీతిలో పోటీపడటం సాధారణమే. కానీ ప్రస్తుతం పోటీ కాస్త భిన్నంగా మారింది. ఆటగాళ్లతో పాటు మాజీలు విజయం కోసం తలపడుతున్నారు. అయితే....

Published : 17 Feb 2021 01:28 IST

ఇంటర్నెట్‌డెస్క్: గెలుపు కోసం ఇరు జట్లు హోరాహోరీగా పోటీపడటం సాధారణమే. కానీ ప్రస్తుతం పోటీ కాస్త భిన్నంగా మారింది. ఆటగాళ్లతో పాటు మాజీలూ విజయం కోసం తలపడుతున్నారు. అయితే మాజీలు పోరాడేది మాత్రం నెట్టింట్లో. తమ జట్టుకు మద్దుతుగా నిలుస్తూ, క్రికెట్ అభిమానులకు ఉత్తేజాన్ని కలిగిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు చేస్తున్నారు. దీన్ని నెటిజన్లు కూడా ఎంతో ఆస్వాదిస్తున్నారు.

భారత మాజీ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్‌, వసీమ్‌ జాఫర్; ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ మ్యాచ్‌ పరిస్థితులకు తగ్గట్లుగా హాస్య చతురతతో పోస్ట్‌లు చేస్తుంటారు. ఇక మైకేల్‌ వాన్‌, మిచెల్‌ క్లార్క్‌, రికీ పాంటింగ్‌ ప్రత్యర్థి జట్టును తక్కువ అంచనా వేస్తూ వ్యాఖ్యలు చేస్తుంటారు. తర్వాత తమ అంచనా తప్పని గుర్తిస్తుంటారు. అయితే, తాజాగా పీటర్సన్‌, జాఫర్‌ మధ్య జరిగిన ‘ట్విటర్ పోరు’ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. భారత్‌ చేతిలో ఇంగ్లాండ్‌ ఘోర ఓటమిని చవిచూడటంతో పీటర్సన్‌ టీమిండియా అభిమానులను కవ్విస్తూ ఓ ట్వీట్ చేశాడు. ‘‘భారత్‌కు శుభాకాంక్షలు.. ‘ఇంగ్లాండ్-బి’ జట్టును ఓడించినందుకు’’ అని ట్వీటాడు. దీనికి జాఫర్‌ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.

‘‘పీటర్సన్‌ను ట్రోల్ చేయకండి. అతడు సరదాగా ఇలా చేస్తున్నాడు. అయితే నాకో విషయం అర్థమైంది. దక్షిణాఫ్రికా వాళ్లు లేకుండా ఇంగ్లాండ్ ఎలా పూర్తి సామర్థ్యం కలిగిన జట్టు అవుతుంది?’’ అని జాఫర్‌ ట్వీట్ చేశాడు. దక్షిణాఫ్రికా చెందిన పీటర్సన్‌ ఇంగ్లాండ్ తరఫున ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే పీటర్సన్‌కు మైండ్‌బ్లాక్‌ అయ్యేలా పంచ్‌ విసిరిన జాఫర్‌ను కొనియాడుతూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని