IND vs AUS: భారత్ - ఆసీస్‌ టెస్టు సిరీస్‌.. పిచ్‌లన్నీ నాసిరకమే: మాజీ కెప్టెన్‌

భారత్ - ఆస్ట్రేలియా జట్ల (IND vs AUS) మధ్య మూడో టెస్టుకు వేదికైన ఇందౌర్ మైదానానికి ఐసీసీ ‘నాసిరకం’ రేటింగ్‌ ఇచ్చింది. తొలి రోజు నుంచే స్పిన్‌కు అనుకూలంగా మారడంతో ఆసీస్ పైచేయి సాధించి గెలిచింది.

Updated : 04 Mar 2023 17:28 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ (Border - Gavaskar Trophy)లో ఇప్పటికే భారత్ - ఆసీస్‌ జట్ల (IND vs AUS) మధ్య మూడు టెస్టులు ముగిశాయి. వరుసగా రెండు టెస్టుల్లో టీమ్‌ఇండియా విజయం సాధించగా..ఇందౌర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో మాత్రం ఆసీస్‌ గెలిచింది. చివరి టెస్టు మ్యాచ్‌ మార్చి 9న అహ్మదాబాద్‌ వేదికగా జరగనుంది. తొలి రెండు టెస్టులు జరిగిన పిచ్‌లకు ‘యావరేజ్‌’ రేటింగ్‌ ఇచ్చిన ఐసీసీ.. ఆసీస్‌ విజయం సాధించిన మూడో టెస్టు పిచ్‌కు మాత్రం ‘నాసిరకం’ (POOR) రేటింగ్‌ ఇవ్వడం గమనార్హం. దీనిపై భారత మాజీలు అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఆసీస్‌ మాజీ కెప్టెన్ మాత్రం ఐసీసీ నిర్ణయంతో ఏకీభవించాడు. ఐసీసీ రేటింగ్‌తో తాను అంగీకరిస్తున్నట్లు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్‌ టేలర్‌ వ్యాఖ్యానించాడు.

‘‘ప్రస్తుతం బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ సిరీస్‌ కోసం తయారు చేస్తున్న పిచ్‌లన్నీ ఇలాగే ఉన్నాయనిపిస్తోంది. మూడు పిచ్‌ల్లోకి ఇందౌర్‌ మైదానంలోని పిచ్‌ మరీ నాసిరకంగా ఉంది. తొలి రోజు నుంచే ఇలా మారుతుందని అస్సలు ఊహించలేదు. సాధారణంగా నాలుగో రోజు కానీ, ఐదో రోజుకు కానీ ఆట స్పిన్‌కు అనుకూలంగా ఉండటం మనం చూస్తుంటాం. అయితే, తొలి రోజే ఇలా మారడంతో సరైన సన్నద్ధత లేదనిపిస్తోంది. పిచ్‌ను సిద్ధం చేయడంలో సరైన పద్ధతులను పాటించలేదు. ఇందౌర్ పిచ్‌ అత్యంత నాసిరకంగా నేను భావిస్తున్నా. అందుకే, ఐసీసీ రేటింగ్‌ కూడా అలాగే ఇచ్చింది. కొంతమంది (సునీల్ గావస్కర్‌ను ఉద్దేశించి) గబ్బా పిచ్‌ గురించి వ్యాఖ్యలు చేశారు. గబ్బా పిచ్‌పై గ్రాస్ ఉంచారు. దీని వల్ల దక్షిణాఫ్రికా, ఆసీస్‌ ఇరు జట్లకూ అనుకూలంగా మారింది. దక్షిణాఫ్రికాకు నలుగురు సీమర్లు ఉన్నారు. అందుకే, గబ్బా పిచ్‌ ఏమీ అనూహ్యంగా స్పందించలేదని మాత్రం చెప్పగలను’’ అని మార్క్‌ టేలర్ వివరించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు