
ఆసీస్‌పై ప్రణాళిక అలా మొదలైంది!
ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియా పర్యటనను భారత్ దిగ్విజయంగా ముగించింది. వన్డే సిరీస్ కోల్పోయినా టీ20 సిరీస్, టెస్టు సిరీస్‌లో అద్వితీయ ప్రదర్శనతో విజయం సాధించింది. ఇక టెస్టుల్లో ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను భారత బౌలర్లు బోల్తాకొట్టించిన తీరు హైలైట్. లెగ్‌సైడ్ ఆడేలా ఉసిగొల్పి వికెట్లు సాధించారు. అయితే ఈ ప్రణాళిక రచన జులైలోనే మొదలైందని టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ తెలిపాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ గతేడాది నవంబర్ 27న తొలి వన్డే ఆడగా, ఈ నెల 15న ఆఖరి టెస్టు ఆడిన సంగతి తెలిసిందే. అంటే ఆసీస్ పర్యటన ఆరంభానికి దాదాపు 5 నెలల ముందే టీమిండియా ప్రణాళికలు రచించింది.
‘‘రవిశాస్త్రి జులైలో నాకు కాల్ చేశారు. ఆస్ట్రేలియా పర్యటన గురించి చర్చించాం. బ్యాట్స్‌మన్ ఆఫ్‌సైడ్ ఆడకుండా నిలువరించేలా ప్రణాళికలు రచించాలనుకున్నాం. ప్రత్యర్థి జట్టు గురించి మాకో అవగాహన ఉంది. వాళ్ల జట్టులో స్టీవ్ స్మిత్, లబుషేన్ ఎక్కువగా పరుగులు చేస్తారు. అందులోనూ వారిద్దరు కట్, పుల్ షాట్లు ఆడటం, ఆఫ్‌సైడ్ వైపు ఎక్కువగా పరుగులు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అంతకుముందు ఆసీస్‌ను న్యూజిలాండ్ ఎలా బోల్తా కొట్టించిందనే విషయాన్ని కూడా పరిగణించాం. స్మిత్ బాడీ లైన్‌కు కివీస్ బౌలర్లు బంతులు వేస్తూ అతడిని ఇబ్బందికి గురిచేశారు’’ అని అరుణ్ అన్నాడు.
‘‘అయితే ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఆఫ్‌సైడ్ ఆడకుండా ఉండేలా చేయాలని రవిశాస్త్రి సూచించాడు. వికెట్లకు బంతులు విసురుతూ లెగ్‌సైడ్ ఆడేలా ఉసిగొల్పుతూ బౌలింగ్ చేయించాలని చెప్పాడు. ఈ ప్రణాళిక విజయంతమైంది. ప్రణాళిక రచనలో కోహ్లీ ఆది నుంచి కీలకపాత్ర పోషించాడు. అడిలైడ్‌లోనూ ఇదే ప్లాన్ అమలు చేశాం. అయితే మెల్‌బోర్న్ నుంచి దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. బౌలర్లు అద్భుతంగా ప్రణాళికను అమలుపరిచారు’’ అని అరుణ్ పేర్కొన్నాడు. పేసర్లతో పాటు స్పిన్నర్లూ లెగ్‌సైడ్ ఉచ్చును అద్భుతంగా అమలు చేసిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి
36 ఆలౌట్: ఆ అర్ధరాత్రి ఏం జరిగిందంటే!
నటరాజ్.. నువ్వో లెజెండ్: వార్నర్
Advertisement