Asian Games: 10వేల మంది ఉన్న స్టేడియంలో పోయిన ఫోన్‌.. కనిపెట్టారిలా..!

Asian Games 2022: ఆసియా గేమ్స్‌లో పాల్గొన్న ఓ క్రీడాకారిణి రద్దీగా ఉన్న స్టేడియంలో తన ఫోన్‌ పోగొట్టుకుంది. పైగా అది స్విచ్చాఫ్‌ చేసి ఉంది. దీంతో వాలంటీర్లు ఎంతో కష్టపడి ఆ ఫోన్‌ను కనిపెట్టారు.

Published : 26 Sep 2023 16:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పోగొట్టుకున్న ఫోన్‌ దొరకడం అంటే చాలా కష్టమే..! అదీనూ స్విచ్చాఫ్‌ చేసిన ఫోన్‌ (Phone) రద్దీ ప్రదేశాల్లో పోతే.. ఇక దానిపై ఆశలు వదలుకోవాల్సిందే..! చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో (Asian Games 2022) ఓ క్రీడాకారిణికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. 10వేల మంది ఉన్న స్టేడియంలో ఆమె తన మొబైల్‌ ఫోన్‌ పోగొట్టుకుంది. అయితే అదృష్టమేంటంటే.. ఆ ఫోన్‌ ఆమెకు దొరికింది. ఆసియా గేమ్స్‌ వాలంటీర్లు ఎంతో కష్టపడి 24 గంటల్లోనే ఆమె ఫోన్‌ను కనిపెట్టేశారు. (Player Lost phone in Asian Games)

హాంకాంగ్‌ (Hong kong)కు చెందిన 12 ఏళ్ల చెస్‌ క్రీడాకారిణి లియు తియాన్‌ యి.. హాంగ్‌జౌ (Hangzhou Asian Games)లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పాల్గొంది. సోమవారం ఉదయం టోర్నీలో పాల్గొనేందుకు స్టేడియంకు వచ్చిన లియు.. తన ఫోన్‌ను పోగొట్టుకుంది. పైగా అది స్విచ్చాఫ్‌ చేసి ఉంది. దీంతో ఈ విషయాన్ని నిర్వాహకులకు చెప్పింది. దీంతో టోర్నీలు పూర్తయిన తర్వాత వాలంటీర్లు ఫోన్‌ కోసం వెతికారు.

భారత్‌ జోరు.. ఈక్వస్ట్రియన్‌లో బంగారు పతకం

10వేల సీట్ల సామర్థ్యం, 5,23000 చదరపు మీటర్ల విస్తీర్ణం గల స్టేడియంలో అణువణువు గాలించారు. సీట్ల వద్ద ఏర్పాటు చేసిన వేలాది వ్యర్థాల బ్యాగుల్లో రాత్రంతా వెతికారు. చివరకు ఓ బ్యాగులో లియు ఫోన్‌ను గుర్తించి ఆమెకు అందజేశారు. ఈ విషయాన్ని ఆసియా గేమ్స్‌ తన అధికారిక ఖాతాలో వెల్లడించింది. అసాధ్యమనుకున్న ఈ పనిని తమ వాలంటీర్లు 24 గంటల్లోనే పూర్తి చేసి.. ఆ క్రీడాకారిణి ఫోన్‌ను కనిపెట్టారని వారిని ప్రశంసించింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

సెప్టెంబరు 23 నుంచి మొదలైన ఆసియా క్రీడలు.. అక్టోబరు 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 45 దేశాల నుంచి దాదాపు 12వేల మందికి పైగా అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ మెగా టోర్నీలో భారత్‌ పతకాల వేట కొనసాగిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని