Pushpa : బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పుష్ప స్టెప్పులు

క్రికెట్లో ఆటగాళ్లు వికెట్లు తీసినప్పుడో, సెంచరీ బాదినప్పుడో తమదైన శైలిలో సంబరాలు చేసుకుంటుంటారు. కానీ, ప్రస్తుతం ట్రెండ్‌ మారిపోయింది. ఎటు చూసినా అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ సినిమా..

Published : 26 Jan 2022 11:50 IST

ఇంటర్నెట్డెస్క్‌ : క్రికెట్లో ఆటగాళ్లు వికెట్లు తీసినప్పుడో, సెంచరీ బాదినప్పుడో తమదైన శైలిలో సంబరాలు చేసుకుంటుంటారు. కానీ, ప్రస్తుతం ట్రెండ్‌ మారిపోయింది. ఎటు చూసినా అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ సినిమా హవా నడుస్తోంది. ఈ సినిమాలో శ్రీవల్లి పాటకు అల్లు అర్జున్‌ వేసిన స్టెప్పులను అనుకరిస్తూ క్రికెటర్లు విభిన్నంగా సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్‌ లీగ్‌ (బీపీఎల్‌)లో పుష్పా ట్రెండ్‌ మొదలైంది. ఓ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డీజే బ్రావో ‘పుష్ప’ స్టెప్పులేయగా, మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాడు నజ్ముల్ ఇస్లాం కూడా అదే విధంగా స్టెప్పులేసి అలరించారు.

* డీజే బ్రావో.. తగ్గేదేలే..

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా కొమిల్లా విక్టోరియన్స్ (సీవీ)‌, ఫార్చ్యూన్‌ బరిషల్‌ జట్ల మధ్య మంగళవారం.. జరిగిన మ్యాచ్‌లో ఓ సరదా ఘటన చోటు చేసుకుంది. ఫార్చ్యూన్‌ బరిషల్ తరఫున ఆడుతున్న డీజే బ్రావో వేసిన 18వ ఓవర్ ఐదో బంతికి.. సీవీ జట్టు ఆటగాడు మహిదుల్‌ ఇస్లామ్ అంకోన్(8) క్యాచ్‌ ఔట్ అయ్యాడు. దీంతో బ్రావో పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు స్టెప్పులేస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఇదిలా ఉండగా తొలుత బ్యాటింగ్ చేసిన సీవీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. అనంతరం బరిషల్ జట్టు కేవలం 95 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో కొమిల్లా విక్టోరియన్స్ జట్టు 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

*మరో మ్యాచ్‌లో నజ్ముల్ ఇస్లాం..

ఫార్చ్యూన్‌ బరిషల్‌, సిల్హెట్‌ సన్‌రైజర్స్‌ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌లో కూడా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. సన్‌రైజర్స్‌ బౌలర్‌ నజ్ముల్ ఇస్లాం వేసిన 15వ ఓవర్‌ రెండో బంతికి బరిషల్ ఆటగాడు మహ్మదుల్లా (33) క్యాచ్‌ ఔటయ్యాడు. దీంతో నజ్ముల్ తగ్గేదేలేదన్నట్లుగా సంబరాలు చేసుకున్నాడు. ఇదిలా ఉండగా గతంలో టీమ్‌ఇండియా ఆటగాళ్లు శిఖర్‌ ధావన్‌, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్‌, ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ పుష్ప పాటలకు స్టెప్పులేసిన విషయం తెలిసిందే.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని