Rohit Vs Kohli: కోహ్లీ, రోహిత్‌లను సరిపోల్చలేం.. సోషల్‌మీడియా వార్‌పై కపిల్‌దేవ్‌ స్పందన

Kapil Dev: టీమ్‌ ఇండియాలో కీలక ఆటగాళ్లయిన రోహిత్‌ శర్మ, కోహ్లీలను సరిపోల్చడం తగదని మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ అన్నారు. ఎవరి శక్తిసామర్థ్యాలు, ఆట వారివని చెప్పారు.

Updated : 27 Jun 2024 16:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో (T20 WorldCup) కీలక సమరానికి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా (SouthAfrica) ఫైనల్‌కు చేరగా.. ఆ జట్టుతో పోటీ పడేందుకు భారత్‌ (India), ఇంగ్లాండ్‌ (England) గురువారం రాత్రి 8 గంటలకు తలపడబోతున్నాయి. ఈక్రమంలో భారత్‌ జట్టులోని కీలక ఆటగాళ్లయిన రోహిత్‌ శర్మ (Rohit Sharma), విరాట్‌ కోహ్లీ (Virat Kohli)పై సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. వీరిద్దరి శక్తిసామర్థ్యాలను పోల్చుతూ అభిమానులు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈనేపథ్యంలో భారత్‌ మాజీ ఆటగాడు కపిల్‌దేవ్‌ స్పందించాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. వారిద్దరినీ సరిపోల్చడం తగదన్నాడు. ఫిట్‌నెస్‌ పరంగా కోహ్లీ అంత బలంగా లేకపోయినా.. ప్రత్యర్థులను ఉతికి ఆరేస్తూ రోహిత్‌ తన పనిని తాను చేసుకుపోతున్నాడని కితాబిచ్చాడు.

‘‘ కోహ్లీ ఫిట్‌నెస్‌ ప్రియుడు. అందులో ఎలాంటి సందేహం లేదు. జిమ్‌లో వర్కౌట్లు చేయడానికి చాలా ఇష్టపడతాడు. వాస్తవానికి, అతడి వల్ల సహచర ఆటగాళ్లలోనూ చాలా మార్పు వచ్చింది. రోహిత్‌ శర్మ మాత్రం జిమ్‌ అంటే పెద్దగా ఇష్టపడడు. అలాగని ఫిట్‌నెస్‌ లేదని కాదు. సులువుగా షాట్‌లు ఆడగలడు. తాజా టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో కోహ్లీ పెద్దగా ప్రదర్శన చేయకపోయినా.. రోహిత్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు కదా. కోహ్లీ 150కేజీలు, 250 కేజీల బరువులు సులువుగా ఎత్తగలడు. అలాగని రోహిత్‌ కూడా ఎత్తాలని లేదు. ఎవరి ఫిట్‌నెస్‌, ఆట వారిది. గ్రౌండ్‌లో కోహ్లీలా రోహిత్‌ ఉత్సాహాన్ని ప్రదర్శించలేడు. తన పరిమితుల గురించి అతడికి తెలుసు. ఈ విషయంలో అతడిని మించిన ఆటగాడు లేడు. రోహిత్‌కు సిక్స్‌ ప్యాక్‌ అక్కర్లేదు.. ఒక్క ప్యాక్‌ ఉన్నా ఈజీగా సిక్సర్లు కొట్టగలడు’’ అని కపిల్‌ కొనియాడాడు.

రోహిత్‌ కెప్టెన్సీ సామర్థ్యాలపైనా కపిల్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమ్‌ ఇండియాను ఇప్పటివరకు సమర్థంగా నడిపించిన కొద్దిమందిలో రోహిత్‌ ఒకడని చెప్పాడు. చాలామంది పెద్ద ఆటగాళ్లు టీమ్‌లోకి వస్తుంటారని, ఎవరు వచ్చినా తమ సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తారని అన్నాడు. చివరికి కెప్టెన్సీ చేసినా.. అందులోనూ తమకే పేరు ప్రతిష్ఠలు రావాలని కోరుకుంటారని చెప్పారు. కానీ, రోహిత్‌ మాత్రం జట్టు మొత్తాన్ని సంతోషంగా ఉంచుతున్నాడని కపిల్‌దేవ్‌ కితాబిచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని