INDvsENG: టీమ్‌ఇండియా క్రికెటర్లకు శుభవార్త!

ఇంగ్లాండ్‌ పర్యటనకు క్రికెటర్ల కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు అనుమతి లభించింది! బ్రిటన్‌ ప్రభుత్వం ఇందుకు అంగీకరించిందని తెలిసింది. బీసీసీఐ అధ్యక్ష కార్యదర్శులు సౌరవ్‌ గంగూలీ, జే షా మాత్రం ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు వెళ్లరని సమాచారం.

Published : 01 Jun 2021 13:27 IST

ఇంగ్లాండ్‌ పర్యటనలో కుటుంబ సభ్యులకు అనుమతి

ముంబయి: ఇంగ్లాండ్‌ పర్యటనకు క్రికెటర్ల కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు అనుమతి లభించింది! బ్రిటన్‌ ప్రభుత్వం ఇందుకు అంగీకరించిందని తెలిసింది. బీసీసీఐ అధ్యక్ష కార్యదర్శులు సౌరవ్‌ గంగూలీ, జే షా మాత్రం ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు వెళ్లరని సమాచారం. బోర్డు అధికారి ఒకరు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.

భారత పురుషులు, మహిళల జట్లు ఒకేసారి ఇంగ్లాండ్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్రికెటర్లంతా ముంబయిలో క్వారంటైన్లో ఉన్నారు. జూన్‌ 18న కోహ్లీసేన న్యూజిలాండ్‌తో టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో తలపడనుంది. నెల రోజుల తర్వాత ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసు ఆడుతుంది. మరోవైపు మిథాలీసేన ఇంగ్లాండ్‌తో టెస్టు, వన్డే సిరీసుల్లో తలపడుతుంది. హర్మన్‌ బృందం మూడు టీ20లు ఆడుతుంది. సుదీర్ఘ పర్యటన కావడంతో క్రికెటర్లు, సహాయ సిబ్బందితో కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత బ్రిటన్‌ అనుమతి తీసుకుంది.

‘అవును, క్రికెటర్లకు శుభవార్త! ఇంగ్లాండ్‌ పర్యటనకు వారు కుటుంబ సభ్యులను తీసుకెళ్లొచ్చు. క్రీడాకారుల మానసిక ఆరోగ్యాన్ని పర్యవేక్షించాల్సిన సమయమిది. బీసీసీఐ ఈ విషయాన్ని అర్థం చేసుకుంది. ఇక నాకు తెలిసిన మేరకు గంగూలీ, జే షాకు ఇంగ్లాండ్‌-వేల్స్‌ క్రికెట్‌ బోర్డు అనుమతి ఇవ్వలేదు. సాధారణంగా మ్యాచులకు ముందు పాలకులు వేదిక వద్దకు వెళ్తారు. ప్రస్తుతం క్వారంటైన్‌ నిబంధనలు ఉండటం, వారికి క్రీడాకారుల నిబంధనలు వర్తించకపోవడంతో 10 రోజుల క్వారంటైన్‌లో ఉండాలి’ అని ఆ అధికారి తెలిపారు.

మహిళలు, పురుషుల జట్లు సౌథాంప్టన్‌ చేరుకోగానే అక్కడే హోటళ్లలో క్వారంటైన్ అవుతాయి. మూడు రోజుల క్వారంటైన్ తర్వాత నెట్స్‌లో సాధన చేసుకోవచ్చు. క్వారంటైన్‌ పూర్తయ్యాక మహిళల జట్టు బ్రిస్టల్‌ వెళ్తుంది. అక్కడే మూడు ఫార్మాట్లు ఆడుతుంది. కోహ్లీసేన సౌథాంప్టన్‌లో ఫైనల్‌ ఆడాక రెండు బృందాలుగా విడిపోయి ప్రాక్టీస్‌ మ్యాచులు ఆడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని