T20 world Cup: అందుకే టీమ్‌ఇండియా పరిస్థితి ఇలా..: కపిల్‌ దేవ్‌

ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ కనీసం సెమీస్‌ కూడా చేరకుండా నిష్క్రమించడం బాధకరమని.. కొంతమంది ఆటగాళ్లు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)కి ఎక్కువగా ప్రాధాన్యం

Updated : 08 Nov 2021 15:45 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ కనీసం సెమీస్‌ కూడా చేరకుండా నిష్క్రమించడం బాధాకరమని క్రికెట్‌ దిగ్గజం కపిల్‌ దేవ్‌ అన్నారు. కొంతమంది ఆటగాళ్లు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)కి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుండటం వల్లే టీమ్‌ఇండియా పరిస్థితి ఇలా తయారయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత క్రికెట్‌ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ షెడ్యూల్‌ ఖరారు చేయాలని సూచించారు. ఐపీఎల్‌-2021 మలి దశ ముగిసిన తర్వాత ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. ఐపీఎల్ ఫ్రాంఛైజీల కోసం భారత క్రికెట్‌ను పణంగా పెట్టొద్దని కపిల్ కోరారు. 2012 తర్వాత ఓ ఐసీసీ టోర్నమెంట్‌లో కనీసం సెమీస్‌ కూడా చేరకుండా వెనుదిరగడం టీమిండియాకు ఇదే తొలిసారి. నామమాత్రమైన ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా సోమవారం నమీబియాతో తలపడనుంది. గ్రూప్‌-2 నుంచి పాకిస్థాన్‌, న్యూజిలాండ్ జట్లు ఇప్పటికే సెమీస్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

‘ఆటగాళ్లు భారత జట్టుకు ఆడటం కంటే ఐపీఎల్‌లో ఆడటానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటే.. వారికి మనమేం చెప్పగలం?. వారి ఆర్థిక పరిస్థితుల గురించి నాకు తెలియదు. కానీ, దేశం తరఫున ఆడటాన్ని ఆటగాళ్లంతా గౌరవంగా భావించాలి. నేనైతే టీమ్‌ఇండియా తరఫున ఆడేందుకే మొదటి ప్రాధాన్యమిస్తాను. ఆ తర్వాతే ఏదైనా. ఐపీఎల్‌లో ఆడొద్దని నేను చెప్పను. ఐపీఎల్ వల్లే చాలామందికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కానీ, దాన్ని ఆటగాళ్లు సక్రమంగా ఉపయోగించుకోలేపోతున్నారు. కాబట్టి, మ్యాచ్‌ల షెడ్యూలింగ్ విషయంలో బీసీసీఐ జాగ్రత్తగా వ్యవహరించాలి. టీమ్‌ఇండియా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టోర్నమెంట్లను ఖరారు చేయాలి. టీ20 ప్రపంచకప్ నుంచి భారత్‌ నిష్క్రమించడం బాధాకరమే. అయినా, ఇప్పటికీ మించిపోయిందేం లేదు. రానున్న ప్రపంచకప్‌ కోసం మరింత మెరుగ్గా తయారవ్వాలి. ఐపీఎల్‌కి, టీ20 ప్రపంచకప్‌కి కొంచెం వ్యవధి ఉండి ఉంటే టీమ్‌ఇండియా పరిస్థితి మరోలా ఉండేదేమో. అందుకే ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా బీసీసీఐ జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని కపిల్ దేవ్ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని