ఫ్రెంచ్‌ ఓపెన్‌పై కరోనా సర్వీస్‌..

కరోనా దాడితో దాదాపుగా ఆరు నెలల పాటు క్రీడా సంబరాలు..

Updated : 22 Sep 2020 04:18 IST

క్వాలిఫైయర్స్‌ ముందు ఇద్దరు ఆటగాళ్లకు కొవిడ్‌

పారిస్‌ : కరోనా ఉగ్రరూపంతో దాదాపుగా ఆరు నెలల పాటు క్రీడా సంబరాలు జరగలేదు. పెద్ద పెద్ద ఈవెంట్లు సైతం వాయిదా పడ్డాయి. అభిమానులకు వినోదాన్ని పంచటానికి ఇప్పుడిప్పుడే అవి తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టెన్నిస్‌ అభిమానులు ఎదురు చూస్తున్న ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌ పారిస్‌లోని రోనాల్డ్‌ గ్యారోస్‌ మైదానంలో సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 11 వరకూ జరగనుంది. దీనికి సంబంధించి నిర్వహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. టోర్నమెంట్‌లో భాగంగా సోమవారం నుంచి క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటిలో పాల్గొనే ఆటగాళ్లకు కరోనా పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. వీరితో పాటు ఒక కోచ్‌ సైతం కొవిడ్‌ బారిన పడ్డారు. మరో ముగ్గురు ఆటగాళ్లు కోచ్‌కు సన్నిహితంగా ఉండటంతో మొత్తం అయిదుగురు ఆటగాళ్లను క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు.

జకోవిచ్‌, నాదల్‌ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఈ టోర్నమెంట్‌కు అందుబాటులో ఉంటామని ఇప్పటికే ప్రకటించారు. వీరితో పాటు ఇప్పుడిప్పుడే తమ ప్రదర్శనతో వెలుగులోకి వస్తున్న జూనియర్‌ ఆటగాళ్లు సీనియర్లపై గెలవాలని సిద్ధమవుతున్న నేపథ్యంలో నిర్వహకులు మైదానంలో ఆట చూడటానికి ప్రేక్షకులకు అనుమతి ఇచ్చారు. రోనాల్డ్ గ్యారోస్‌ మైదానంలో మూడు కోర్టులు అందుబాటులో ఉండగా ఒక్కో చోట ఐదు వేల మంది ప్రేక్షకులకు మించకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని