Rohith Sharma: ప్రత్యేకంగా ఏదో చేయాలని..

టీ20 ప్రపంచకప్‌లో ప్రత్యేకంగా ఏదో చేయాలనే తపన జట్టులోని అందరిలోనూ ఉందని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చెప్పాడు. సూపర్‌-8 దశలో తక్కువ వ్యవధిలో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి రావడం సమస్యేమీ కాదని అతనన్నాడు.

Published : 19 Jun 2024 04:23 IST

బ్రిడ్జ్‌టౌన్‌: టీ20 ప్రపంచకప్‌లో ప్రత్యేకంగా ఏదో చేయాలనే తపన జట్టులోని అందరిలోనూ ఉందని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చెప్పాడు. సూపర్‌-8 దశలో తక్కువ వ్యవధిలో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి రావడం సమస్యేమీ కాదని అతనన్నాడు. గురువారం అఫ్గానిస్థాన్‌తో భారత్‌ తమ తొలి సూపర్‌-8 మ్యాచ్‌ ఆడాల్సిన ఉన్న నేపథ్యంలో రోహిత్‌ బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ.. ‘‘సూపర్‌-8లో ఓ మ్యాచ్‌ ఆడిన మూణ్నాలుగు రోజుల్లోనే ఇంకో రెండు మ్యాచ్‌లు ఆడాలి. ఇది కొంచెం ఒత్తిడికి గురి చేసేదే అయినా.. ఇలాంటి వాటికి అలవాటు పడిపోయాం. ప్రయాణాలు చేస్తూ మ్యాచ్‌లు ఆడడాన్ని ఒక సాకుగా చూడం. టోర్నీలో ఏదైనా ప్రత్యేకంగా చేయాలనే తపన జట్టులోని అందరిలో ఉంది. ఇది సూపర్‌-8ను ఆరంభించే ముందు శుభ సంకేతం. తమ నైపుణ్యాలను చాటడం ద్వారా ప్రతి ఒక్కరూ తేడా చూపించాలనుకుంటున్నారు. కరీబియన్‌ దీవుల్లో మేం చాలా మ్యాచ్‌లు ఆడాం. ఇక్కడ సానుకూల ఫలితాలు రాబట్టాలంటే ఏం చేయాలో జట్టు సభ్యులకు తెలుసు. మ్యాచ్‌ల కోసం అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు’’ అని చెప్పాడు.

కుల్‌దీప్‌ను తీసుకుంటే..: ఐపీఎల్‌తో పాటు అంతకుముందు టీమ్‌ఇండియాకు ఆడిన మ్యాచ్‌ల్లోనూ చక్కటి ఫామ్‌ కనబరిచినప్పటికీ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌కు టీ20 ప్రపంచకప్‌లో తుది జట్టులో అవకాశం దక్కట్లేదు. అయితే సూపర్‌-8 దశ నుంచి అయినా అతడికి అవకాశమిస్తే జట్టుకు చాలా మేలు జరుగుతుందని న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘ప్రపంచకప్‌ ముందుకు సాగేకొద్దీ పిచ్‌ల్లో మార్పు వస్తుంది. బంతి బాగా తిరుగుతుంది. కాబట్టి కుల్‌దీప్‌ను తీసుకుంటే జట్టులో వికెట్లు తీసే సామర్థ్యం పెరుగుతుంది’’ అని ఫ్లెమింగ్‌ అన్నాడు. ప్రపంచకప్‌లో ఇప్పటిదాకా పెద్దగా రాణించకపోయినప్పటికీ జడేజా ప్రమాదకర ఆల్‌రౌండరే అని ఫ్లెమింగ్‌ చెప్పాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని