Rishabh Pant: రిషభ్‌ పంత్‌ ప్రమాద ఘటన.. స్పందించిన మోదీ

క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Updated : 30 Dec 2022 17:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా యువ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై ట్విటర్‌ వేదికగా స్పందించిన ప్రధాని.. పంత్‌ త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించారు.

మాజీ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్ (Sachin Tendulkar)‌, క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ (Virat Kohli), హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya), శిఖర్‌ ధావన్‌ సహా పలువురు ఆటగాళ్లు కూడా సోషల్‌మీడియా వేదికగా స్పందిస్తూ పంత్‌ (Pant)కు ధైర్యం చెప్పారు. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

రోడ్డు ప్రమాదం.. క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌కు తీవ్ర గాయాలు

శుక్రవారం ఉదయం దిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌ వెళ్తుండగా పంత్‌ కారు డివైడర్‌ను ఢీకొట్టిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే అతడిని దేహ్రాదూన్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో పంత్‌ తల, మోకాలికి గాయమైంది. వీపు భాగం కాలిపోయింది. అయితే ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడానే ఉన్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రమాద సమయంలో కారులో పంత్‌ ఒక్కడే ఉన్నట్లు ఉత్తరాఖండ్‌ డీజీపీ అశోక్‌ కుమార్‌ స్పష్టం చేశారు. వాహనంపై నియంత్రణ కోల్పోవడంతోనే అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడని.. దీంతో వాహనంలో మంటలు చెలరేగినట్లు డీజీపీ వెల్లడించారు. దీంతో రిషభ్‌ పంత్‌ త్వరగా కోలుకోవాలని సచిన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, వసీం అక్రమ్‌, రవీంద్ర జడేజా, వీరేంద్ర సెహ్వాగ్‌, గౌతమ్‌ గంభీర్‌, మునాఫ్ పటేల్, మహమ్మద్ అజారుద్దీన్‌ తదితరులు ట్విటర్ వేదికగా ఆకాంక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని