Team India- Modi: నాపై నాకే నమ్మకం కుదరలేదు: కోహ్లీ

టీ20 ప్రపంచకప్‌ సొంతం చేసుకొని స్వదేశానికి చేరుకున్న టీమ్‌ఇండియా గురువారం ప్రధాని మోదీతో మర్యాదపూర్వకంగా సమావేశమైంది. ఆ విశేషాలతో కూడిన వీడియోను పీఎంవో తాజాగా విడుదల చేసింది.

Updated : 05 Jul 2024 19:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో (T20 WorldCup) భారత్‌ విజయఢంకా మోగించింది. ఫైనల్‌ మ్యాచ్‌లో ప్రత్యర్థి దక్షిణాఫ్రికాను (South Africa) కోలుకోలేని దెబ్బకొట్టి కప్‌ను సొంతం చేసుకుంది. గురువారం స్వదేశంలో అడుగుపెట్టిన టీమ్‌ ఇండియాకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. దిల్లీలో దిగిన తర్వాత రోహిత్‌ సేన.. ప్రధాని మోదీ నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా భేటీ అయింది. ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరించిన ప్రధాని.. టోర్నీ విశేషాలను తెలుసుకున్నారు. వారితోనే అల్పాహారం చేసి.. సరదాగా వారిని ప్రశ్నిస్తూ ఉత్సాహం నింపారు. ఆ విశేషాలతో కూడిన వీడియోను పీఎంవో తాజాగా విడుదల చేసింది.

టోర్నీ ప్రారంభం నుంచి కోహ్లీ ఎదుర్కొన్న ఒడుదొడుకులతోపాటు, ఫైనల్‌ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌ గురించి మోదీ ఆరా తీశారు. టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో జట్టుకు, తన నైపుణ్యానికి న్యాయం చేయలేనేమో అనిపించిందని చెప్పిన కోహ్లీ... కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వల్లే చివరి వరకు స్వేచ్ఛగా ఆడగలిగానని అన్నాడు. ప్రారంభం నుంచి తక్కువ పరుగులకే ఔటవుతున్నా.. తనపై నమ్మకం ఉంచి.. చివరి మ్యాచ్‌ వరకు కొనసాగించారని చెప్పాడు.

‘విరాట్‌.. ఈ టోర్నీలో తీవ్ర ఒడుదొడుకులకు గురయ్యారు కదా.. మీరేమంటారు?’ అని ప్రశ్నించగా.. కోహ్లీ బదులిస్తూ..‘‘ ఫైనల్ మ్యాచ్‌ జరిగిన రోజు జీవితంలో మర్చిపోలేను. ఆ రోజు నాకెంతో ప్రత్యేకం. టోర్నీలో నేను జట్టుకు ఎంత చేయాలనుకున్నానో.. అంత చేయలేకపోయాను. ఇదే విషయాన్ని ఒకానొక దశలో కోచ్‌ ద్రవిడ్‌కు చెప్పేశాను. ‘జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వే అండగా నిలుస్తావన్న నమ్మకం నాకుంది’ అని ఆయన ధైర్యం చెప్పారు. రోహిత్ శర్మతోనూ ఇదే విషయాన్ని చెప్పా. ఫైనల్‌ మ్యాచ్‌లో ఇద్దరం కలిసి ఓపెనర్స్‌గా వెళ్తున్నప్పుడు.. నాపై నాకే నమ్మకం కుదరలేదు. కానీ, తొలి ఓవర్లో మూడు బౌండరీలు బాదేసరికి కొంచెం ధైర్యం వచ్చింది.’’ అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు. మ్యాచ్ ప్రారంభంలోనే భారత్‌ 3 కీలక వికెట్లు కోల్పోయిన సమయంలో కోహ్లీ.. 75 పరుగులతో జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

అందుకే మట్టి తిన్నా: రోహిత్‌

అంతకుముందు కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పిచ్‌ మట్టి రుచి ఎలా ఉందని సరదాగా ప్రశ్నించారు. అసలు ఎందుకు అలా మట్టి నోట్లో వేసుకున్నారు? అని అడగ్గా.. ఆ పిచ్‌ అద్భుత విజయాన్ని అందించి పెట్టిందని, ఆ క్షణాలను కలకాలం గుర్తుంచుకునేందుకే అక్కడి మట్టిని తిన్నానని రోహిత్‌ చెప్పుకొచ్చాడు. ‘‘ విజయం కోసం మేమెంతో కష్టపడ్డాం. ఆ క్షణాల కోసం ఎంతోకాలం వేచి చూశాం. కొన్నిసార్లు చివరి వరకు వచ్చాం. కానీ, ముందుకెళ్లలేకపోయాం. కానీ, ఈసారి అందరి ఆకాంక్ష నెరవేరింది. ఇంతటి అద్భుత విజయాన్ని అందించిన పిచ్‌ను, ఆ క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలనే అక్కడి మట్టిని నోట్లో వేసుకున్నాను’’ అని రోహిత్‌ బదులిచ్చాడు.

దాని వెనక రహస్యం?: మోదీ

మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం రోహిత్‌ కప్‌ను అందుకునేందుకు కాస్త ప్రత్యేకంగా నడుచుకుంటూ వెళ్లడం, జట్టు సభ్యులు కూడా అతడిని అనుకరించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనిపైనా మోదీ ఆరా తీశారు. దీని వెనకున్న రహస్యమేంటని సరదాగా ప్రశ్నించారు. అందులో రహస్యమేమీ లేదని, కాస్త వైవిధ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే అలా చేశామని రోహిత్‌ బదులిచ్చాడు. దీనిపై స్పందించిన మోదీ.. ఇది చాహల్  సలహాయేనా? అని మళ్లీ అడిగారు. నవ్వేసిన రోహిత్‌.. చాహల్‌, కుల్‌దీప్‌ ఇలా చేయమని సలహా ఇచ్చారని అన్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని