FIFA World Cup: పోర్చుగల్‌ గోల్స్‌ మోత.. స్విట్జర్లాండ్‌ చిత్తు

కీలక పోరులో పోర్చుగల్‌ జట్టు గోల్స్‌ మోత మోగించింది. గొంకలో రామోస్‌ మూడు గోల్స్‌తో స్విస్‌ జట్టును బెంబేలెత్తించాడు. బంతి ఎక్కువ సేపు తమ నియంత్రణలోనే ఉన్నప్పటికీ స్విస్‌ జట్టు 6-1 తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది.

Published : 07 Dec 2022 05:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కీలక పోరులో పోర్చుగల్‌ జట్టు గోల్స్‌ మోత మోగించింది. గొంకలో రామోస్‌ మూడు గోల్స్‌తో స్విస్‌ జట్టును బెంబేలెత్తించాడు. బంతి ఎక్కువ సేపు తమ నియంత్రణలోనే ఉన్నప్పటికీ స్విస్‌ జట్టు 6-1 తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఈ దెబ్బకు ఆ జట్టు ఈ ఫిఫా ప్రపంచకప్‌లో తన ప్రస్థానాన్ని ముగించింది. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్‌ ఆటగాళ్లు దూకుడు ప్రదర్శించారు. అందివచ్చిన అవకాశాలు ఉపయోగించుకున్నారు. ముఖ్యంగా రెండో అర్ధభాగంలో చెలరేగారు. తొలి అర్ధభాగంలో ఒక గోల్‌ చేసిన రామోస్‌ రెండో అర్ధభాగంలో మరింతగా రాణించి రెండు గోల్స్‌ చేశాడు. ఈ విజయంతో పోర్చుగల్‌ జట్టు క్వార్టర్స్‌కు చేరింది. ఇక తన తదుపరి మ్యాచ్‌లో మాజీ ఛాంపియన్‌ స్పెయిన్‌ ఓడించి సంచలనం సృష్టించిన మొరాకో జట్టుతో తలపడనుంది. 

మ్యాచ్‌ ప్రారంభమైన 17 నిమిషాల వద్ద జావో ఫెలిక్స్‌ నుంచి పాస్‌ అందుకున్న రామోస్‌ బంతిని గోల్‌పోస్టులోకి నెట్టడంతో పోర్చుగల్‌ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 33 నిమిషాల వద్ద బ్రూనో ఫెర్నాండెస్‌ నుంచి పాస్‌ అందుకున్న పీప్‌ తలతో కళ్లుచెదిరే రీతిలో గోల్‌ కొట్టాడు. దీంతో 2-0 తేడాతో పోర్చుగల్‌ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇక రెండో అర్ధభాగంలో 51 నిమిషాల వద్ద రామోస్‌ మరో గోల్‌ కొట్టి 3-0 తేడాతో తన జట్టును మరింత ఆధిక్యంలో తీసుకెళ్లాడు. కాసేపటికే 55 నిమిషాల వద్ద రామోస్‌ నుంచి పాస్‌ అందుకున్న రాఫేల్‌ గెరీరో గోల్‌ చేయడంతో పోర్చుగల్‌ 4-0 లీడ్‌లోకి వెళ్లింది. అయితే 58 నిమిషాల వద్ద స్విట్జర్లాండ్‌ ఆటగాడు మాన్యువల్‌ అకంజీ గోల్‌ చేయడంతో స్విస్‌ జట్టు ఖాతా తెరిచింది. ఇక 67 నిమిషంలో మరోసారి రామోస్‌, మ్యాచ్‌ అదనపు సమయంలో రాఫేల్‌ లియో గోల్‌ చేశారు. ఈ  ఆటలో స్విస్‌ ఆటగాళ్లు ఏ మాత్రం దూకుడు ప్రదర్శించలేకపోయారు. పోర్చుగల్‌ కంటే ఎక్కువ పాస్‌లు అందుకున్నప్పటికీ స్విట్జర్లాండ్‌ ఆటగాళ్లు గోల్స్‌ చేయడంలో విఫలమయ్యారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని