Dilip Vengsarkar : ఆ ఇద్దరిలో ఒకరికి కెప్టెన్సీ అప్పగిస్తే బాగుంటుంది: దిలీప్‌ వెంగ్‌సర్కార్‌

టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ ముగింపు పలికినప్పటి నుంచి.. తర్వాతి కెప్టెన్‌ ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు కోహ్లీ వారసుడు ఎవరనే...

Published : 20 Jan 2022 01:55 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ ముగింపు పలికినప్పటి నుంచి.. తర్వాతి కెప్టెన్‌ ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు కోహ్లీ వారసుడు ఎవరనే దానిపై కొన్ని పేర్లను సూచించారు. తాజాగా, సెలెక్షన్‌ కమిటీ మాజీ ఛైర్మన్ దిలీప్ వెంగ్‌ సర్కార్.. టీమ్‌ఇండియా కెప్టెన్సీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, రవిచంద్రన్‌ అశ్విన్‌లలో ఒకరికి బాధ్యతలు అప్పగించాలని సూచించాడు.

‘ఓపెనర్‌ రోహిత్‌ శర్మ, సీనియర్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లలో ఒకరికి ఏడాది కాలం పాటు టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలి. ఇదే సమయంలో భారత జట్టుకు భవిష్యత్‌ కెప్టెన్‌ను కూడా సిద్ధం చేసుకోవాలి. నేను సెలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అప్పటి కెప్టెన్‌ రాహుల్ ద్రవిడ్‌ టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలకడంతో.. తర్వాతి కెప్టెన్‌ ఎవరనే విషయంలో సందిగ్ధం నెలకొంది. అప్పటికే వన్డే జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్న ధోనికే టెస్టు పగ్గాలు కూడా అప్పగించాలని కొందరు సూచించారు. అయితే, మేం బాగా ఆలోచించి అనుభవమున్న అనిల్‌ కుంబ్లేను ఆస్ట్రేలియా పర్యటనకు కెప్టెన్‌గా ఎంపిక చేశాం. అతడు అద్భుతంగా రాణించాడు. అదే సమయంలో ధోనిని భవిష్యత్‌ టెస్టు కెప్టెన్‌గా తీర్చిదిద్దాం’ అని దిలీప్‌ వెంగ్‌ సర్కార్‌ పేర్కొన్నాడు. 

కెప్టెన్సీ ఒత్తిడి కారణంగానే విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో విఫలమవుతున్నాడనే వ్యాఖ్యలను దిలీప్‌ కొట్టిపారేశాడు. ‘కెప్టెన్సీ ఒత్తిడి కారణంగానే కోహ్లీ విఫలమవుతున్నాడనే వాదనతో నేను ఏకీభవించను. గత ఐదేళ్లుగా ఇటు కెప్టెన్‌గా, అటు బ్యాటర్‌గా కీలకంగా వ్యవహరిస్తున్నాడు. భారతీయులు ఎప్పుడూ రికార్డుల ఆధారంగానే ఆటగాడిని అంచనా వేస్తుంటారు. అలాంటి రికార్డులను నేను పట్టించుకోను. గత రెండేళ్లుగా అతడు సెంచరీ నమోదు చేయలేదనేది వాస్తవమే. కానీ, జట్టుకు అవసరమైనప్పుడు మెరుగ్గా రాణిస్తున్నాడు. ఇటీవల కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టులో ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయినా.. కోహ్లీ నిలకడగా ఆడాడు. 160 బంతులను ఎదుర్కొని 79 పరుగులు చేశాడు. అతడు చాలా నిబద్ధతతో ఆడుతున్నాడు’ అని వెంగ్‌ సర్కార్‌ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని