Pranati Nayak: డ్రైవర్‌ తనయ టోక్యో విమానంలో..

మధ్య తరగతి కుటుంబం.. నాన్న ఓ డ్రైవర్‌! ఇంట్లో ఎలాంటి క్రీడా సంస్కృతి లేదు.. అసలు ఒక అథ్లెట్‌

Published : 12 May 2021 11:11 IST

ఈనాడు క్రీడావిభాగం


మధ్య తరగతి కుటుంబం.. నాన్న ఓ డ్రైవర్‌! ఇంట్లో ఎలాంటి క్రీడా సంస్కృతి లేదు.. అసలు ఒక అథ్లెట్‌ ఎదిగే అనుకూల వాతావరణమే లేదక్కడ! అలాంటి చోటి నుంచి ఓ ఛాంపియన్‌ పుట్టింది!  ఏకంగా టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ పట్టేసింది! కాంటినెంటల్‌ కోటాలో బెర్తు సాధించిన ఆ సంచలన జిమ్నాస్టే ప్రణతి నాయక్‌! పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈ 26 ఏళ్ల అమ్మాయి టోక్యోలో భారత జిమ్నాస్టిక్స్‌కు ప్రాతినిధ్యం వహించబోతోంది. దీపా కర్మాకర్‌ తర్వాత ఈ మెగా ఈవెంట్లో పాల్గొనబోతున్న ఘనత ఆమెదే. 

వెదురు కర్రతో.. 
మిడ్నపూర్‌లో మధ్య తరగతి కుటుంబంలో జన్మించి జిమ్నాస్టిక్స్‌ ఛాంపియన్‌గా ఎదిగిన ప్రణతి ప్రయాణమే విభిన్నం. ముగ్గురు అమ్మాయిలు ఉన్న కుటుంబంలో ఆరంభం నుంచి ప్రణతి చాలా చురుకే. ఇంట్లో కుప్పి గంతులు వేసే ఆమెను జిమ్నాస్టిక్స్‌కు పరిచయం చేశారు తల్లిదండ్రులు సుమంత నాయక్, ప్రతిమ. రెండు చెట్ల మధ్య ఒక వెదురు కర్రను కట్టి దానిపై నుంచి దూకడం నేర్పించాడు సుమంత. తన చురుకుదనం వల్లే ఆమె ఈ ఆటలో వేగంగా మెలకువలు నేర్చుకోగలిగింది. అయితే మంచి ఆహారం ఇస్తే ఆమె మరింత బలంగా తయారై ఈ ఆటలో రాటుదేలుతుందని భావించిన ప్రణతి తండ్రి కోల్‌కతాలోని భారత క్రీడా ప్రాధికార సంస్థ హాస్టల్‌లో చేర్చాలని ఆశించాడు. కానీ సెలక్షన్‌కు వెళ్లినప్పుడు బక్కగా ఉందని ఆమె జిమ్నాస్టిక్స్‌కు పనికి రాదంటూ సీటు ఇవ్వలేమని చెప్పేశాడు కోచ్‌. కానీ బస్సు డ్రైవర్‌గా పని చేసే నాన్న సుమంత నాయక్‌ వెనక్కి తగ్గలేదు. అక్కడ దగ్గరలోని గదిలో ఆమెను ఉంచి శిక్షణ ఇప్పించాడు. రోజూ మూడు బస్సులు మారుతూ గంటల కొద్ది ప్రయాణించి ఆమె కోల్‌కతాలో శిక్షణకు వెళ్లేది. ఒకవైపు చదువు కొనసాగిస్తూనే ప్రాక్టీస్‌ చేసేది. అయితే ప్రణతి ఇబ్బందులను గమనించిన కోచ్‌ మినారా బేగం ఆమెకు తన దగ్గరే బస కల్పించి శిక్షణ ఇచ్చింది. ఇదే ప్రణతి కెరీర్‌ను మలుపు తిప్పింది. ప్రణతి సహజ సామర్థ్యాన్ని సానబట్టి ఆమెను మెరుగైన జిమ్నాస్ట్‌గా తయారు చేసింది మినారా.   ‘‘ప్రణతి పరిస్థితి చూసి షాక్‌ అయ్యా. బస్సు డ్రైవర్‌ అయిన ఆమె నాన్న తన కూతురుని ఛాంపియన్‌ను చేసేందుకు తన విధులను వదిలిపెట్టి రోజూ గంటలు ప్రయాణించి కోచింగ్‌ ఇప్పించడం నన్ను కదిలించింది. అందుకే ఆమెను నా దగ్గరే ఉంచుకుని ట్రయినింగ్‌ ఇచ్చా. ఆట పట్ల ఆమె అంకితభావానికి ఆశ్చర్యపడ్డా. ప్రణతికి సహజసిద్ధమైన నైపుణ్యం ఉంది. ఆమెకు కావాల్సింది మార్గనిర్దేశనమే. నేను చేసింది అదే’’ అని కోచ్‌ మినారా చెప్పింది. 
రష్యాలో మెరిసి
వయసు కేటగిరిల్లో జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొడుతూ వచ్చిన ప్రణతి.. అంతర్జాతీయ వేదికపై సత్తా చాటేందుకు ఎక్కువ సమయం తీసుకోలేదు. రష్యాలో జరిగిన జూనియర్‌ ఆసియాడ్‌లో స్వర్ణంతో మెరిసిన ఈ అమ్మాయి..2014 ఆసియా క్రీడల్లో దీపా కర్మాకర్‌తో పాటు పాల్గొంది. కానీ బీమ్‌లో నాలుగు, వాల్ట్‌లో అయిదో స్థానంలో మాత్రమే నిలువగలిగింది. ఆ తర్వాత 2019 మంగోలియాలో జరిగిన ఆసియా ఆర్టిస్టిక్‌ ఛాంపియన్‌షిప్‌లో వాల్ట్‌లో కాంస్యం గెలవడం ప్రణతి ఆత్మవిశ్వాసాన్ని ఎంతో పెంచింది. దీపా కర్మాకర్‌తో కలిసి సాధన చేయడం ఆమె ఆటను ఎంతో మెరుగుపరిచింది. బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొనాలనేదే ప్రణతి తొలి లక్ష్యం. కానీ ఆమెకు అనూహ్యంగా టోక్యో బెర్తు దక్కింది. అంతర్జాతీయ జిమ్నాస్ట్‌గా ఉంటూ తన కుటుంబ బాధ్యతలు కూడా ఆమె నెరవేర్చింది. 2018లో రైల్వేస్‌లో ఉద్యోగం రావడం, పతకాల వల్ల ప్రైజ్‌మనీ కూడా దక్కడంతో తన కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచింది. ‘‘ఒలింపిక్స్‌ బెర్తు సాధిస్తాని ఊహించలేదు. అది నా ప్రణాళికల్లో కూడా లేదు. 2022లో బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్వెల్త్‌ క్రీడల్లో రాణించాలనే లక్ష్యంతో ఉన్నా. కానీ టోక్యోకి వెళ్లబోతుండడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. ఒలింపిక్స్‌లో సత్తా చాటుతాననే నమ్మకముంది’’ అని ప్రణతి తెలిపింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని