Prithvi Shaw: సెల్ఫీలు నిరాకరించినందుకు పృథ్వీ షాపై దాడి.. 8 మందిపై కేసు నమోదు

జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తూ ఉన్న టీమ్ఇండియా (Team India) యువ క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి అతడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అయితే ఇందులో ఎలాంటి గాయాలు కాలేదు కానీ, అతడి స్నేహితుడి కారు మాత్రం ధ్వంసమైంది.

Published : 16 Feb 2023 16:12 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా (Team India) యువ ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shaw) దాడికి గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. తన స్నేహితుడితో కలిసి బుధవారం (ఫిబ్రవరి 15న) ఓ హోటల్‌కు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముంబయిలోని ఓషివారా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. తొలుత సెల్ఫీలను తిరస్కరించినందుకు దాడి చేసినట్లు (Attack On Prithvi Shaw) భావించినప్పటికీ.. డబ్బు ఇవ్వకపోతే తప్పుడు కేసులు పెడతామని బెదిరించినట్లు కూడా ఫిర్యాదులో పృథ్వీ షా స్నేహితుడు ఆశిశ్ సురేంద్ర పేర్కొన్నారు. 

పోలీసుల వివరాల ప్రకారం.. సురేంద్రతో కలిసి పృథ్వీ షా శాంతాక్రూజ్‌లోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు వెళ్లాడు. నిందితులు సెల్ఫీ కోసం పృథ్వీ షా వద్దకు వచ్చారు. అయితే ఇద్దరితో మాత్రమే సెల్ఫీ దిగేందుకు షా ఆసక్తి చూపగా.. గ్రూప్‌లోని మిగతావారు కూడా వచ్చి సెల్ఫీ ఇవ్వాలన్నారు. తాను స్నేహితులతో కలిసి భోజనానికి వచ్చానని, ఇప్పుడు అందరితో సెల్ఫీ ఇవ్వడం కుదరదని పృథ్వీ షా వారికి సమాధానం ఇచ్చాడు. అప్పటికీ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో షా స్నేహితుడు వెంటనే హోటల్‌ మేనేజర్‌ను పిలిచి ఫిర్యాదు చేశారు. హోటల్‌ నుంచి వెళ్లిపోవాలని నిందితులను మేనేజర్ అడగడంతో అదంతా మనసులో పెట్టుకొని.. హోటల్‌ నుంచి బయటకు వచ్చిన పృథ్వీ షా, అతడి స్నేహితుడి కారుపై బేస్‌బాల్ బ్యాట్లతో దాడికి పాల్పడ్డారు. బీఎండబ్ల్యూ కారు వెనుక, ముందర భాగంలోని కిటికీలు ధ్వంసమైనట్లు పోలీసులు తెలిపారు. 

సంఘటన సమయంలో కారులోనే పృథ్వీ షా ఉన్నాడని..  అయితే దీనిని వివాదం చేయకూడదనే ఉద్దేశంతో అతడిని వేరే కారులో సురక్షితంగా ఇంటికి పంపించినట్లు సురేంద్ర తెలిపారు. అయితే ఓ మహిళ తన కారును వెంబడించి మరీ జోగేశ్వరి లోటస్ పెట్రోల్‌ పంప్‌ దగ్గర ఆపేసిందని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలంటే రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేసిందని, లేకపోతే తప్పుడు కేసులు పెడతామని బెదిరించారని వెల్లడించారు. ఫిర్యాదు అందుకొన్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పృథ్వీ షాను సెల్ఫీలను అడిగిన వివరాలను హోటల్‌ సిబ్బంది నుంచి రాబట్టిన పోలీసులు నిందితులిల్లో ఇద్దరిని గుర్తించారు. సనా అలియాస్‌ సప్నా గిల్, శోభిత్‌ ఠాకూర్‌ను అదుపులోకి తీసుకొన్నారు. ఎనిమిది మందిపై ఐపీసీ సెక్షన్స్‌ 143, 148, 149, 384, 437, 504, 506 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని