Prithvi Shaw: నెల రోజుల వ్యవధి.. చాలా కష్టపడ్డా.. ఫలితం సాధించా: పృథ్వీ షా

దిల్లీ చేతిలో ఓటమితో పంజాబ్ కింగ్స్ (PBKS vs DC) ప్లేఆఫ్స్ అవకాశాలకు గండి పడింది. ఇక తన చివరి మ్యాచ్‌లోనూ (రాజస్థాన్‌తో) గెలిచినా ప్రయోజనం శూన్యం. దాదాపు ఇంటిముఖం పట్టినట్లే.

Published : 18 May 2023 12:51 IST

ఇంటర్నెట్ డెస్క్: దిల్లీ క్యాపిటల్స్‌ యువ బ్యాటర్ పృథ్వీ షా (54: 38 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌) ఈ సీజన్‌లో తొలిసారి అర్ధశతకంతో రాణించాడు. దీంతో పంజాబ్ కింగ్స్‌పై దిల్లీ 213/2 స్కోరు చేసింది. దాదాపు నెల రోజుల తర్వాత దిల్లీ తరఫున పృథ్వీ బరిలోకి దిగాడు. ఆరంభంలో వరుసగా ఆడిన మ్యాచుల్లో విఫలమై విమర్శలపాలయ్యాడు. ఈ మ్యాచ్‌కు ముందు చివరిసారిగా ఏప్రిల్ 20న కోల్‌కతాతో ఆడాడు. ఆ తర్వాత ఇప్పుడే తుది జట్టులోకి వచ్చాడు. ఈ క్రమంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని హాఫ్‌ సెంచరీ బాదాడు. మరోవైపు పంజాబ్‌ చివరి వరకు పోరాడినా 198/8కే పరిమితమై ఓటమిపాలైంది. ఈ క్రమంలో తన ప్రదర్శనపై పృథ్వీ షా సంతోషం వ్యక్తం చేశాడు. మరో బ్యాటర్ రోసోవ్‌ (82*: 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు) సూపర్ ఇన్నింగ్స్‌ ఆడాడు. దీంతో అతడికే ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు వచ్చింది.

‘‘చాలా రోజుల తర్వాత మంచి ఇన్నింగ్స్‌ ఆడటం ఆనందంగా ఉంది. ఇలా ఆడాలంటే కొన్నిసార్లు తీవ్రంగా శ్రమించాలి. ఈ మ్యాచ్‌ కోసం చాలా కష్టపడ్డా. పిచ్‌ బాగుంది. ఆరంభంలో కాస్త పేస్‌కు అనుకూలంగా అనిపించినా.. బ్యాటింగ్‌కు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. తేమ ప్రభావం మ్యాచ్‌ ప్రారంభం నుంచే ఉంది. ఫీల్డర్ల మధ్య ఖాళీలను గుర్తించి ఆడగలితే సులువుగానే పరుగులు రాబట్టవచ్చు’’ అని షా తెలిపాడు. 

ఫీల్డింగ్‌ బాగోలేదు: డేవిడ్ వార్నర్

‘‘విజయం సాధించడం ఆనందంగా ఉన్నప్పటికీ.. మా ఫీల్డింగ్‌ సరిగా లేదనిపించింది. క్యాచ్‌లను చేజార్చాం. పృథ్వీ షా ఇంపాక్ట్‌ చూపాడు. రిలీ రోసోవ్‌ అద్భుతంగా ఆడాడు. మా సొంత మైదానాల్లో నిలకడగా ఆడాల్సిన అవసరం ఉంది. చివరి మ్యాచ్‌ చెన్నైతో దిల్లీ వేదికగానే ఆడతాం’’ అని వార్నర్ చెప్పాడు. 

నిరుత్సాహపరిచింది: ధావన్

‘‘కీలక సమయంలో ఓటమిని చవిచూడటం నిరుత్సాహానికి గురి చేసింది. తొలుత బౌలింగ్‌లో కాస్త వెనుకబడ్డాం. కొన్ని వికెట్లను తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి తేవాల్సింది. కానీ, అలా జరగలేదు. చివరి ఓవర్‌ను స్పిన్నర్‌తో వేయించడం కూడా మిస్‌ఫైర్ అయింది. ఆ ఓవర్‌లో ఏకంగా 23 పరుగులు వచ్చాయి. ఓ రెండు ఓవర్లు మాత్రం భారీగా పరుగులు సమర్పించడంతో దిల్లీ పెద్ద స్కోరు చేసేసింది. ఇక లక్ష్య ఛేదన సమయంలో తొలి ఓవర్‌లోని ఆరు బంతులను వృథా చేసేశాం. నేను కూడా ఎదుర్కొన్న మొదటి బంతికే పెవిలియన్‌కు చేరా. అయితే, మా బ్యాటర్ లియాన్‌ లివింగ్‌స్టోన్ పోరాటం అద్భుతం. చివర్లో నోబాల్ పడినప్పుడు కాస్త ఆశలు చిగురించాయి. దురదృష్టవశాత్తూ విజయం సాధించలేకపోయాం’’ అని పంజాబ్ కెప్టెన్ ధావన్‌ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు