
పృథ్వీ × పడిక్కల్
ముంబయి-కర్టాటక విజయ్ హజారె
సెమీఫైనల్ నేడే
దిల్లీ: విజయ్ హజారె ట్రోఫీ వన్డే ఛాంపియన్‌షిప్ సెమీఫైనల్లో గురువారం ముంబయి జట్టు కర్ణాటకను ఢీకొట్టనుంది. అందరికళ్లూ యువ ఓపెనర్లు పృథ్వీ షా, దేవ్‌దత్ పడిక్కల్‌లపైనే. సూపర్ ఫామ్‌లో ఉన్న వాళ్లు ఎలా చెలరేగుతారో అన్న ఆసక్తి నెలకొంది. ముంబయికి నాయకత్వం వహిస్తున్న పృథ్వీ గ్రూప్ దశలో పుదుచ్చేరిపై అజేయంగా 227 పరుగులు చేసి.. టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. క్వార్టర్‌ఫైనల్లో మంగళవారం సౌరాష్ట్రపై 185 పరుగులతో అజేయంగా నిలిచిన అతడు... లిస్ట్-ఎ క్రికెట్లో ఛేదనలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాట్స్‌మన్‌గా ఘనత సాధించాడు. మరోవైపు పడిక్కల్ లిస్ట్-ఎ క్రికెట్లో వరుసగా నాలుగు సెంచరీలు బాదిన తొలి భారతీయుడిగా నిలిచాడు. 673 పరుగులతో ఈ టోర్నీ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. షా, పడిక్కల్‌లు జోరు కొనసాగిస్తూ భారీ ఇన్నింగ్స్‌తో తమ జట్లను ఫైనల్ చేర్చడానికి ప్రయత్నిస్తారనడంలో సందేహం లేదు. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ఎంపిక చేయనున్న నేపథ్యంలో పడిక్కల్.. సెలక్టర్లను ఆకట్టుకోవాలని అనుకుంటున్నాడు కూడా. మనీష్ పాండే, ప్రసిద్ధ్ కృష్ణ, ఆల్‌రౌండర్ శ్రేయస్ గోపాల్, కె.గౌతమ్ వంటి ఆల్‌రౌండర్లతో కర్ణాటక జట్టే ముంబయి కన్నా కాస్త బలంగా కనిపిస్తోంది. కుర్రాళ్లతో నిండిన ముంబయికి రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్‌లు అందుబాటులో లేరు. మరో సెమీఫైనల్లో గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్ తలపడతాయి.