Wrestlers Protest: బ్రిజ్‌భూషణ్‌ను ఎందుకు కాపాడుతున్నారు..? రెజ్లర్ల దీక్షలో ప్రియాంక గాంధీ

Wrestlers Protest: డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా అగ్రశ్రేణి రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా మద్దతు పలికారు. నేడ దీక్షా శిబిరానికి వెళ్లి రెజ్లర్లకు సంఘీభావం పలికారు.

Updated : 29 Apr 2023 10:33 IST

దిల్లీ: భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ అగ్రశ్రేణి రెజ్లర్లు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. వీరి నిరసనకు భారత క్రీడాలోకంతో పాటు పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ ఉదయం కాంగ్రెస్‌ అగ్రనేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) కూడా రెజ్లర్లకు సంఘీభావం పలుకుతూ దీక్షలో పాల్గొన్నారు. ఈ ఉదయం జంతర్‌ మంతర్‌ వద్ద దీక్షా శిబిరానికి వచ్చిన ఆమె.. రెజ్లర్లతో మాట్లాడి వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్‌, వినేశ్‌ ఫొగాట్‌.. ప్రియాంకకు తమ సమస్యలను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ నాయకురాలు కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. (Wrestlers Protest)

‘‘బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. కానీ ఇంతవరకూ ఆ కాపీలను బయటకు చూపించలేదు. అందులో ఏముందో ఎవరికీ తెలియదు. ఎఫ్‌ఐఆర్‌ కాపీలను ఎందుకు బయటపెట్టట్లేదు?ఈ రెజ్లర్లు పతకాలు గెలిచినప్పుడు మనమంతా ట్విటర్‌లో పోస్ట్‌ చేసి గర్వపడ్డాం. ఇప్పుడు అదే క్రీడాకారులు న్యాయం కోసం రోడ్డెక్కారు. మహిళా రెజ్లర్లంతా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మరో గత్యంతరం లేక ఇలా గొంతెత్తారు. కానీ, ప్రభుత్వం మాత్రం వీరి ఆవేదనను వినకుండా బ్రిజ్‌భూషణ్‌ను ఎందుకు కాపాడాలని ప్రయత్నిస్తోంది?వీరి సమస్యను ప్రధాని మోదీ పరిష్కరిస్తారన్న నమ్మకం లేదు. ఒకవేళ వీరి గురించి ఆయన ఆందోళన చెంది ఉంటే.. ఇంతవరకూ రెజ్లర్లతో ఎందుకు మాట్లాడలేదు?కనీసం వీరిని కలవడానికి కూడా ప్రయత్నించలేదు’’ అని ప్రియాంక (Priyanka Gandhi) దుయ్యబట్టారు. రెజ్లర్లకు యావత్‌ దేశం అండగా నిలుస్తుందని ఆమె ధైర్యం చెప్పారు.

బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా తమ ఆందోళనకు మద్దతివ్వాలని ఇటీవల రాజకీయ పార్టీలు, హక్కుల సంఘాలను రెజ్లర్లు కోరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ నేతలు భూపిందర్‌ హుడా, దీపిందర్‌ హుడా, ఉదిత్‌ రాజ్‌ సహా పలువురు నాయకులు రెజ్లర్ల దీక్షలో పాల్గొన్నారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా నేడు క్రీడాకారులను కలిసి మద్దతివ్వనున్నట్లు తెలుస్తోంది.

రాజీనామా చేస్తా కానీ.. : బ్రిజ్‌భూషణ్‌

మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్న బ్రిజ్‌భూషణ్‌ నేడు మీడియాతో మాట్లాడారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీ తనకు ఇంకా అందలేదని తెలిపారు. ‘‘నేను అమాయకుడిని. న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తా. విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తా. రాజీనామా చేయడం అనేది పెద్ద విషయం కాదు. కానీ నేనే తప్పు చేయలేదు. క్రిమినల్‌ను కాదు. ఒకవేళ ఇప్పుడు రాజీనామా చేస్తే వారు (రెజ్లర్లు) చేస్తున్న ఆరోపణలు నిజమని అంగీకరించినట్లే’’ అని బ్రిజ్‌ భూషణ్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఆందోళన చేస్తున్న రెజ్లర్లు ఈ మధ్యాహ్నం 2 గంటలకు మీడియా సమావేశం నిర్వహించి తమ భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని