Olympics: పతకం తెస్తే ₹కోట్లు.. ఏయే దేశాలెంత ప్రకటించాయో తెలుసా?

ఒలింపిక్స్‌లో పాల్గొనాలనేది అథ్లెట్ల కల. ఈ మహాక్రీడల్లో గెలుపొంది పతకం సాధించే క్రీడాకారులు తమ పేరునే కాదు.. వారి దేశ ప్రతిష్ఠను సైతం ప్రపంచానికి తెలియజేసినవారవుతారు. అందుకే, అథ్లెట్లు పతకాలు గెలుపొందితే దేశాలు, స్థానిక ప్రభుత్వాలు ప్రోత్సహకంగా నగదు బహుమతులు అందజేస్తుంటాయి. ఈ సారి కూడా

Updated : 01 Aug 2021 20:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒలింపిక్స్‌లో పాల్గొనాలనేది అథ్లెట్ల కల. ఈ మహాక్రీడల్లో గెలుపొంది పతకం సాధించే క్రీడాకారులు తమ పేరునే కాదు.. వారి దేశ ప్రతిష్ఠను సైతం ప్రపంచానికి తెలియజేసినవారవుతారు. అందుకే, అథ్లెట్లు పతకాలు గెలుపొందితే దేశాలు, స్థానిక ప్రభుత్వాలు ప్రోత్సాహకంగా నగదు బహుమతులు అందజేస్తుంటాయి. ఈ సారి కూడా ఒలింపిక్స్‌లో పతకాలు తెచ్చేవారికి ప్రభుత్వాలు నజరానా ప్రకటించాయి. మన దేశంలోనే కాదు.. పలు దేశాలు కూడా పతకాలు గెలిచిన వారికి నగదు బహుమతి ఇవ్వబోతున్నాయి.

భారత్‌లోని వివిధ రాష్ట్రాల నుంచి 120 మంది దాకా అథ్లెట్లు ఈ సారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. అయితే, ఎన్ని పతకాలు వస్తాయనేది ఇప్పుడే చెప్పలేం కానీ, పతకాలు తెస్తే నగదు బహుమతులిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. స్వర్ణ పతకం గెలిస్తే రూ.75 లక్షలు, రజతం గెలిస్తే రూ.40 లక్షలు, కాంస్యం గెలిస్తే రూ.25 లక్షలు ఇస్తామని తెలిపింది. మరోవైపు తమ రాష్ట్రం నుంచి ఒలింపిక్స్‌కు వెళ్లిన అథ్లెట్లు స్వర్ణ పతకం తెస్తే రూ.6 కోట్లు, రజతం తెస్తే రూ.4 కోట్లు, కాంస్యం తెస్తే రూ.2-2.5 కోట్లు అందజేస్తామని హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌, ఒడిశా, ఛండీగఢ్‌ ప్రకటించాయి. కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాలు స్వర్ణ పతక విజేతలకు రూ.5 కోట్లు చొప్పున ఇవ్వనున్నాయి. దిల్లీ ప్రభుత్వం బంగారు పతకాలు తెచ్చిన వారికి రూ.3 కోట్లు ఇవ్వనుంది. ఇతర దేశాలతో పోలిస్తే పతకాలు గెలిచే అథ్లెట్లకు ఇచ్చే నగదు బహుమతి భారత్‌లోనే అత్యధికంగా ఉండటం విశేషం.

ఇక ఇతర దేశాల విషయానికొస్తే.. బంగారు పతకం గెలిచిన క్రీడాకారులకు ఇండోనేషియా 7,46,000 డాలర్లు (రూ.5.55కోట్లు),  సింగపూర్‌ 735,000 డాలర్లు (రూ.5.47 కోట్లు), హాంకాంగ్‌ 644,000 డాలర్లు (రూ.4.80కోట్లు), థాయ్‌లాండ్‌ 309,000 డాలర్లు (2.30కోట్లు), కజకిస్థాన్‌ 250,000 డాలర్లు (రూ.1.86కోట్లు), ఇటలీ 212,000 డాలర్లు (1.58కోట్లు) నగదు బహుమతి ప్రకటించాయి. అగ్రరాజ్యం అమెరికా పతకాలు తెచ్చేవారికి ఇచ్చే నజరానా చాలా తక్కువ. స్వర్ణం గెలిచే అమెరికన్‌ అథ్లెట్‌కు 37,500 డాలర్లు (రూ.28లక్షలు) ప్రకటించగా.. ఆతిథ్య దేశం జపాన్‌ 45,200 డాలర్లు (రూ.34లక్షలు) ఇవ్వనుంది. ఇక ఫ్రాన్స్‌ 65,000 డాలర్లు (రూ.48లక్షలు), రష్యా 61,000 డాలర్లు (రూ.45లక్షలు), బ్రెజిల్‌ 47,500 డాలర్లు (రూ.35లక్షలు), దక్షిణాఫ్రికా 37,000 (రూ.27.5లక్షలు) నెదర్లాండ్స్‌ 35,400 డాలర్లు (రూ.26లక్షలు), జర్మనీ 22,000 డాలర్లు (రూ.16లక్షలు), కెనడా 16,000 డాలర్లు  (రూ.12లక్షలు), ఆస్ట్రేలియా 15,100 డాలర్లు (రూ.11లక్షలు) నజరానాగా ఇవ్వబోతున్నట్లు వెల్లడించాయి.

బ్రిటన్‌, నార్వే, స్వీడన్‌ దేశాలు మాత్రం అథ్లెట్లకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. దానికి బదులుగా ఒలింపిక్స్‌, పారాఒలింపిక్స్‌ క్రీడల కోసం ఏటా 160 మిలియన్‌ డాలర్లు కేటాయిస్తున్నాయి. ఈ డబ్బుతో అథ్లెట్లకు శిక్షణ, స్టైఫండ్‌ ఇస్తున్నారు. నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల అథ్లెట్లలో క్రీడా స్ఫూర్తి రాదని బ్రిటన్‌ నమ్మకం. అందుకే నజరానా ఇవ్వడానికి విముఖుత చూపుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని