
IND vs NZ: శ్రేయస్ అయ్యర్.. శ్రమకు ఫలితం దక్కింది : రికీ పాంటింగ్
ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేయడంపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ వ్యక్తం చేశాడు. శ్రేయస్ ఇన్నేళ్లు పడిన శ్రమకు తగిన ఫలితం దక్కిందని పేర్కొన్నాడు. కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ సందర్బంగా.. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ నుంచి క్యాప్ అందుకొన్న శ్రేయస్ అయ్యర్ టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. రాహుల్ ద్రవిడ్ టీమ్‌ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత క్రికెట్ జట్టులోకి అరంగేట్రం చేస్తున్న యువ ఆటగాళ్లకు.. మాజీ క్రికెటర్ల నుంచి క్యాప్ అందించే సాంప్రదాయాన్ని పరిచయం చేశాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన టీ20 సిరీస్ ద్వారా టీమ్‌ఇండియాలోకి అరంగేట్రం చేసిన హర్షల్ పటేల్‌కు మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ క్యాప్ అందించిన విషయం తెలిసిందే.
‘గత కొన్నేళ్లుగా నువ్వు పడిన శ్రమకు ఫలితం దక్కింది. ఇది ఆరంభం మాత్రమే. గర్వంగా ఉంది శ్రేయస్ అయ్యర్’ అని దిల్లీ క్యాపిటల్స్ మెంటార్ రికీ పాంటింగ్ ట్వీట్ చేశాడు. 2017లో వన్డే క్రికెట్లోకి అడుగు పెట్టిన శ్రేయస్.. టెస్టు క్రికెట్లో చోటు కోసం చాలా కష్టపడ్డాడని పేర్కొన్నాడు. టీమ్‌ఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి వైదొలగడంతో.. అతడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ని తుది జట్టులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మిడిల్ ఆర్డర్‌లో సూర్యకుమార్‌ని బరిలోకి దింపాలనుకున్నా.. చివరి నిమిషంలో శ్రేయస్ అయ్యర్‌ని జట్టులోకి తీసుకున్నారు. దీంతో అరంగేట్రం కోసం సూర్యకుమార్ యాదవ్ మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
► Read latest Sports News and Telugu News