Shoaib Akhtar: షోయబ్‌ అక్తర్‌పై పీటీవీ రూ.10కోట్ల పరువునష్టం దావా

పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్.. పీటీవీ మధ్య వివాదం మరింత ముదిరింది. అక్తర్‌పై పీటీవీ పాకిస్థానీ రూ. 10కోట్ల మేర పరువు నష్టం దావా వేసింది. అక్తర్‌ తమ సంస్థకు రాజీనామా చేయడం ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, అతడి చర్య వల్ల తమ ఛానెల్‌ ఆర్థికంగా భారీగా నష్టపోయిందని పీటీవీ వెల్లడించింది.

Updated : 09 Nov 2021 12:20 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్.. పీటీవీ మధ్య వివాదం మరింత ముదిరింది. అక్తర్‌పై పీటీవీ పాకిస్థానీ రూ. 10కోట్ల పరువు నష్టం దావా వేసింది. అక్తర్‌ తమ సంస్థకు రాజీనామా చేయడం ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, అతడి చర్య వల్ల తమ ఛానెల్‌ ఆర్థికంగా భారీగా నష్టపోయిందని పీటీవీ వెల్లడించింది.

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్‌ 26న జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై పాకిస్థాన్‌ గెలుపొందింది. దీనిపై పీటీవీలో నిర్వహించిన చర్చలో షోయబ్‌ అక్తర్‌ పాల్గొన్నాడు. చర్చలో అక్తర్.. వ్యాఖ్యాత మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వ్యాఖ్యాత అక్తర్‌ను బయటకి వెళ్లిపోమన్నడంతో అక్తర్‌ ఆగ్రహంతో బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత పీటీవీకి రాజీనామా కూడా చేసేశాడు. దీంతో పీటీవీ అక్తర్‌పై న్యాయపరమైన చర్యలకు దిగింది. ‘ఒప్పందం ప్రకారం అక్తర్‌ మూడు నెలలు పీటీవీతో కలిసి పనిచేయాలి. కానీ, మధ్యలోనే అక్తర్‌ రాజీనామా చేయడంతో ఛానెల్‌కు భారీ నష్టం జరిగింది’’అని పీటీవీ తన నోటీస్‌లో పేర్కొంది. రూ. 10కోట్లతో పాటు మూడు నెలల వేతనం అంటే పాకిస్థానీ కరెన్సీలో రూ. 33.33లక్షలు పరిహారం కింద చెల్లించాలని పీటీవీ డిమాండ్‌ చేస్తోంది. 

అసలేం జరిగిందంటే.. పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌ అనంతరం జరిగిన పీటీవీ లైవ్‌ డిబేట్‌లో అక్తర్‌తోపాటు సర్​ వివియన్​ రిచర్డ్స్​, డేవిడ్ ​గోవర్​, రషీద్​ లతీఫ్​, ఉమర్ గుల్​, ఆకిబ్ జావేద్​లాంటి మాజీలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే అక్తర్‌.. పాక్ బౌలర్లు హరీస్‌ రవూఫ్‌, షహీన్‌ ఆఫ్రిదిపై ప్రశంసలు కురిపించగా నౌమన్ మధ్యలో కలుగజేసుకొని.. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇతర విషయాల గురించి మాట్లాడొద్దని వారించాడు.

అయితే, అక్తర్‌ ఆ మాటలను పట్టించుకోకుండా తన అభిప్రాయాలు కొనసాగించడంతో ఆ వ్యాఖ్యాతకు కోపమొచ్చింది. దీంతో షోయబ్‌ తనపట్ల అమర్యాదగా వ్యవహరించాడని, దీన్ని సహించబోనని.. తన షో నుంచి వెళ్లిపోవాలని ఆదేశించాడు. ఇదంతా ప్రత్యక్షప్రసారం అవుతుండగానే జరిగింది. చివరికి అక్తర్ తన మైక్రోఫోన్ తొలగించి బయటకు వెళ్లిపోయాడు. అతడు వెళ్లిపోయాక ఆ కార్యక్రమం అలాగే కొనసాగడం కొసమెరుపు. తర్వాత ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని