
IND vs NZ: ఓపెనర్ల కంటే వాళ్లిద్దరే ఎక్కువ పరుగులు చేస్తారు: ఆకాశ్ చోప్రా
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగనున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓపెనర్ల కంటే.. అజింక్య రహానె, ఛెతేశ్వర్ పుజారా జోడీ ఎక్కువ పరుగులు చేస్తుందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా జోస్యం చెప్పాడు. అలాగే, న్యూజిలాండ్ జట్టులో కెప్టెన్ కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్ మెరుగ్గా రాణిస్తారని అంచనా వేశాడు. తొలి టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి గైర్హాజరీతో.. రహానె కెప్టెన్‌గా, పుజారా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే.
‘తొలిటెస్టులో టీమ్‌ఇండియా ఓపెనర్ల కంటే రహానె, పుజారా జోడీ ఎక్కువ పరుగులు చేస్తుందనుకుంటున్నాను. ఎందుకంటే, చాలా రోజులుగా ‘టెస్టు స్పెషలిస్ట్’ పుజారా మూడంకెల స్కోరును అందుకోలేకపోయాడు. మరోవైపు, టెస్టు జట్టులో స్థానం పదిలపరుచుకోవాలంటే రహానె తప్పని సరిగా రాణించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో స్వదేశంలో జరుగుతున్న ఈ టెస్టులో వీరిద్దరూ మెరుగ్గా రాణిస్తారనుకుంటున్నాను. అలాగే రోహిత్ శర్మ, గాయం కారణంగా కేఎల్ రాహుల్ ఈ సిరీస్‌కు దూరం కావడంతో యువ ఆటగాళ్లు ఓపెనింగ్ చేయనున్నారు. వారు ఏ మేరకు రాణిస్తారో చూడాలి. భారత స్పిన్నర్లు కచ్చితంగా పదికి పైగా వికెట్లు తీస్తారనిపిస్తోంది. న్యూజిలాండ్ జట్టులో ప్రస్తుతం కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. తొలి టెస్టులో వారిద్దరూ కలిసి 125కి పైగా పరుగులు చేసే అవకాశం ఉంది’ అని ఆకాశ్ చోప్రా జోస్యం చెప్పాడు. న్యూజిలాండ్ జట్టు చివరిసారిగా 1988లో టీమ్‌ఇండియాను సొంత గడ్డపై ఓడించిన విషయం తెలిసిందే.
► Read latest Sports News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.