INDvsAUS: గబ్బా టెస్టే ఫేవరెట్‌

ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాపై గబ్బాలో ఆడిన టెస్టే తమ కెరీర్‌లో అత్యంత ఇష్టమైన మ్యాచ్‌ అని టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్‌ చెతేశ్వర్‌ పుజారా, రిషభ్‌ పంత్‌ పేర్కొన్నారు...

Published : 19 Jun 2021 01:09 IST

టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ పుజారా, పంత్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాపై గబ్బాలో ఆడిన టెస్టే తమ కెరీర్‌లో అత్యంత ఇష్టమైన మ్యాచ్‌ అని టీమ్ఇండియా బ్యాట్స్‌మెన్‌ చెతేశ్వర్‌ పుజారా, పంత్‌ పేర్కొన్నారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ తుదిపోరు సందర్భంగా పలువురు భారత్‌, న్యూజిలాండ్‌ ఆటగాళ్లను వారికి ఇష్టమైన టెస్టు మ్యాచ్‌, క్రికెట్‌ మైదానాల పేర్లు చెప్పమని అడగ్గా వీళ్లిద్దరూ ఇలా చెప్పుకొచ్చారు. తొలుత బుమ్రా స్పందిస్తూ 2018లో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా జోహెనస్‌బర్గ్‌లో ఆడిన తన అరంగేట్రం టెస్టు మ్యాచ్‌ ఫేవరెట్‌ అని తెలిపాడు.

అనంతరం రిషభ్‌పంత్ స్పందిస్తూ తనకు ఇటీవల ఆస్ట్రేలియాపై గబ్బాలో ఆడి గెలిపించిన టెస్టే చాలా ఇష్టమని చెప్పాడు. సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మాట్లాడుతూ.. తాను చూసిన మ్యాచ్‌ల్లో 2001లో ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా భారత్‌ ఆస్ట్రేలియాను ఓడించిన టెస్టంటే చాలా ఇష్టమని చెప్పాడు. ఇక ప్రత్యక్షంగా చూసిన మ్యాచ్‌ల్లో 1999లో పాకిస్థాన్‌.. భారత పర్యటన సందర్భంగా చెన్నైలో ఆడిన తొలి టెస్టు అని వెల్లడించాడు. ఆ మ్యాచ్‌లో భారత్‌ 12 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైనా సచిన్‌ (136) వీరోచిత పోరాటం తనకింకా గుర్తుందని చెప్పాడు. అనంతరం చెతేశ్వర్‌ పుజారా స్పందిస్తూ గబ్బా టెస్టునే పేర్కొన్నాడు. చివరగా ఇషాంత్‌ మాట్లాడుతూ 2008లో ఇంగ్లాండ్‌తో ఆడిన తొలి టెస్టు అని, తర్వాత 2014లో లార్డ్స్‌లో అదే ఇంగ్లిష్‌ జట్టుతో తలపడటమని వివరించాడు.

గబ్బా టెస్టులో భారత్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించడమే కాకుండా 2-1 తేడాతో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ సైతం కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ చేసి 369 పరుగులు చేయగా, భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులు చేసింది. ఇక్కడ ప్రధాన బ్యాట్స్‌మెన్‌ విఫలమైనా వాషింగ్టన్‌ సుందర్‌ (62), శార్దూల్‌ ఠాకూర్‌ (67) అర్ధశతకాలతో రాణించారు. అనంతరం ఆసీస్‌ 294 పరుగులకు ఆలౌటవ్వగా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 33 పరుగులు కలుపుకొని భారత్‌ ముందు 328 లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలోనే రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌గిల్‌ (91), రిషభ్‌ పంత్‌ (89 నాటౌట్‌), పుజారా (56) అర్ధశతకాలతో మెరిసి జట్టును విజయతీరాలకు చేర్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని