రాబోయే రెండూ.. భారత్‌కు అత్యంత కీలకం

అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరగబోయే మిగిలిన రెండు టెస్టులూ టీమ్‌ఇండియాకు అత్యంత కీలకమని స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ చెతేశ్వర్‌ పుజారా అన్నాడు. మరీ ముఖ్యంగా బుధవార...

Updated : 21 Feb 2021 11:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరగబోయే మిగిలిన రెండు టెస్టులూ టీమ్‌ఇండియాకు అత్యంత కీలకమని స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ చెతేశ్వర్‌ పుజారా అన్నాడు. మరీ ముఖ్యంగా బుధవారం నుంచి ప్రారంభమయ్యే డై/నైట్‌ టెస్టు చాలా ముఖ్యమని చెప్పాడు. కోహ్లీసేన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్‌తో తలపడాలంటే మిగిలిన రెండు టెస్టుల్లో.. ఒకటి గెలిచి, ఒక డ్రా చేసుకోవాలి. లేదా రెండూ గెలవాలి. ఈ నేపథ్యంలోనే మొతేరాలో జరగబోయే మిగతా మ్యాచ్‌లు చాలా కీలకమైనవని పేర్కొన్నాడు.

‘మేం భారత్‌లో ఒకే డే/నైట్‌ టెస్టు ఆడాము. అది కూడా ఎస్‌జీ బంతితో. దేశవాళీ క్రికెట్‌లో నేను ఆడింది మొత్తం కాకాబుర్రా బంతితో. అలాగే నేను ఎక్కవ టెస్టులు ఆడినప్పటికీ పింక్‌బాల్‌తో ఆడిన అనుభవం పెద్దగా లేదు. సిరీస్‌కు ఒక పింక్‌బాల్‌ మ్యాచ్‌ ఆడటంలో అనుభవం అక్కర్లేదని నేననుకుంటా. ఆ బంతితో ఆడేకొద్దీ అనుభవం అదే వస్తుంది. ఇదొక టెస్టు క్రికెట్‌ మాత్రమే’ అని పుజారా చెప్పుకొచ్చాడు.

ఇక ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌పై మాట్లాడుతూ.. ‘లార్డ్స్‌లో తుదిపోరుకు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్‌ ఎంతో కీలకం. కాబట్టి ఈ పింక్‌బాల్‌ టెస్టుపై పూర్తి దృష్టి సారిస్తాం. ఒక జట్టుగా మాకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాం. మిగిలిన రెండు టెస్టులూ ఎంతో కీలకం కాబట్టి మా ప్రణాళికలకు కట్టుబడి ఉంటాం’ అని నయావాల్‌ వివరించాడు.

పుజారా ఈ సిరీస్‌లో తొలి టెస్టులో 73, 15 రెండో టెస్టులో 21, 7 పరుగులు చేశాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలోనూ అర్ధశతకాలతో రాణించినా పెద్ద ఇన్నింగ్స్‌ ఆడలేదు. దీంతో రాబోయే టెస్టుల్లోనైనా అతడు భారీ స్కోర్లు సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు పుజారా ఇటీవల జరిగిన ఐపీఎల్‌ 14వ సీజన్‌ వేలంలో పాల్గొన్నాడు. దాంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ.50లక్షలకు అతడిని కొనుగోలు చేసింది. అయితే, ఏడేళ్ల తర్వాత తిరిగి ఈ మెగా ఈవెంట్‌లో అడుగుపెడుతున్నాడు. మరి ధోనీ జట్టులో ఎలా ఆడనున్నాడో వేచిచూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని