వికెట్లు విరగొట్టిన అర్ష్‌దీప్‌.. ట్విటర్‌లో పంజాబ్‌ కింగ్స్‌- ముంబయి పోలీసుల సరదా చర్చ!

ముంబయి(Mumbai Indians)తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో రెండు సార్లు స్టంప్స్‌ను విరగొట్టి హర్ష్‌దీప్‌ సింగ్‌(Arshdeep Singh) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. అతడి ప్రతిభను పంజాబ్‌ కింగ్స్‌ ట్విటర్‌లో మెచ్చుకుంటూ సరదా పోస్టు పెట్టింది.

Updated : 23 Apr 2023 20:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ :  చివరి ఓవర్లో 16 పరుగులు అవసరమైన వేళ.. బంతిని అందుకున్న పంజాబ్‌ యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌(Arshdeep Singh) అద్భుతమే చేశాడు. ముంబయి ఇండియన్స్‌(Mumbai Indians) బ్యాటర్లకు చుక్కలు చూపించి.. కేవలం రెండు పరుగులే ఇచ్చి  రెండు వికెట్లు తీశాడు. అదీనూ రెండు సార్లు స్టంప్స్‌ విరగొట్టాడు. దీంతో అతడు తీసిన వికెట్ల కంటే.. స్టంప్స్‌ విరగొట్టిన అంశంపైనే చర్చ ఎక్కువగా సాగుతోంది. ఇదే విషయాన్ని మ్యాచ్‌ అనంతరం పంజాబ్‌ కింగ్స్‌(Punjab Kings) ట్విటర్‌లో ప్రస్తావించింది.

తమ బౌలర్‌ ప్రతిభను ప్రశంసిస్తూ.. అర్ష్‌దీప్‌ బంతికి వికెట్లు విరిగిపోయిన అంశాన్ని సరదాగా క్రైమ్‌తో పోల్చుతూ ముంబయి పోలీసు(Mumbai Police)లను పంజాబ్‌ కింగ్స్‌ ట్విటర్‌లో ట్యాగ్‌ చేసింది. ‘హే ముంబయి పోలీసు.. మేం ఓ క్రైమ్‌ గురించి రిపోర్టు చేయాలనుకుంటున్నాం..’ అంటూ వికెట్‌ విరిగిపోయిన ఫొటోను పంచుకుంది. దీనికి ముంబయి పోలీసు విభాగం కూడా అంతే సరదాగా స్పందించింది. ‘చట్టాలను బ్రేక్‌ చేస్తే చర్యలుంటాయి తప్ప.. స్టంప్స్‌ను బ్రేక్‌ చేస్తే కాదు’ అంటూ సరదాగా బదులిచ్చింది. దీంతో ఈ పోస్టు క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. 

మరోవైపు ముంబయి ఇండియన్స్‌ టీమ్‌ కూడా ఇదే విషయం మీద ట్వీట్‌ చేసింది. ‘‘ముంబయి పోలీసులారా.. మేం కూడా ఓ ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నాం. 15 ఏళ్ల నుంచి పంజాబ్‌ జట్టు ఐపీఎల్‌ ట్రోపీని మిస్‌ అవుతోంది. మా తరఫున మిస్సింగ్‌ కంప్లైంట్‌ ఇవ్వాలనుకుంటున్నాం’’ అని ట్వీట్‌లో పేర్కొంది. దీంతో ఈ చర్చ వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో సామ్‌ కరన్‌ (55; 29 బంతుల్లో 5×4, 4×6) విధ్వంసక బ్యాటింగ్‌కు అర్ష్‌దీప్‌ (4/29) అదిరే బౌలింగ్‌తో తోడవడంతో.. 13 పరుగుల తేడాతో పంజాబ్‌.. ముంబయి ఇండియన్స్‌ను ఓడించిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని