DC vs PBKS: పంజాబ్‌ ఘన విజయం.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం

దిల్లీ క్యాపిటల్స్‌పై పంజాబ్‌ కింగ్స్‌ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత ప్రభ్‌సిమ్రన్‌ సింగ్ (103; 65 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) శతకం బాదడంతో పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167  పరుగులు చేసింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులే చేసింది.

Updated : 13 May 2023 23:58 IST

దిల్లీ: ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ అదరగొట్టింది. దిల్లీ క్యాపిటల్స్‌పై 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత ప్రభ్‌సిమ్రన్‌ సింగ్ (103; 65 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లు) శతకం బాదడంతో పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167  పరుగులు చేసింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులే చేసింది. డేవిడ్ వార్నర్ (54; 27 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌) మాత్రమే రాణించాడు. ఫిలిప్‌ సాల్ట్ (21),  అమన్ ఖాన్‌ (16), ప్రవీణ్ దూబె (16) పరుగులు చేశారు. పంజాబ్‌ బౌలర్లలో హర్‌ప్రీత్‌ బ్రార్‌ (4/30) దిల్లీని గట్టి దెబ్బతీశాడు. రాహుల్ చాహర్‌ (2/16),నాథన్ ఎల్లిస్‌ (2/26) కూడా ఆకట్టుకున్నారు. 

పవర్‌ ప్లే వరకు దిల్లీ.. తర్వాత పంజాబ్‌

ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి వార్నర్ దూకుడుగా ఆడాడు. రిషి ధావన్ వేసిన తొలి ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన వార్నర్.. తర్వాతి ఓవర్‌లో ఓ బౌండరీ బాదాడు. హర్‌ప్రీత్‌ బ్రార్‌ ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో మరో ఓపెనర్ ఫిలిప్‌ సాల్ట్ రెండు ఫోర్లు, వార్నర్ ఒక ఫోర్ బాదారు. సామ్‌కరన్‌, నాథన్‌ ఎల్లిస్‌ వేసిన తర్వాతి రెండు ఓవర్లలో వార్నర్ ఓవర్‌కు రెండు బౌండరీల చొప్పున రాబట్టాడు. అర్ష్‌దీప్ వేసిన ఆరో ఓవర్‌లో వరుసగా 4,6 బాదాడు. దీంతో పవర్‌ ప్లే ముగిసేసరికి 65/0తో పటిష్ట స్థితిలో నిలిచిన దిల్లీ.. అలవోకగా విజయం సాధించేలా కనిపించింది. కానీ, ఏడో ఓవర్‌ నుంచి మ్యాచ్‌ ఒక్కసారిగా మలుపు తిరిగింది. దిల్లీ వరసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఏడో ఓవర్‌లో ఫిలిప్ సాల్ట్‌ను హర్‌ప్రీత్‌ క్లీన్‌బౌల్డ్ చేశాడు. తర్వాత వచ్చిన మిచెల్ మార్ష్‌ (3)ను రాహుల్ చాహర్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. హర్‌ప్రీత్‌ వేసిన తొమ్మిదో ఓవర్లో తొలి బంతికి రొసోవ్ (5) సికిందర్‌ రజాకు క్యాచ్ ఇవ్వగా.. 23 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్‌ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రాహుల్ చాహర్‌ బౌలింగ్‌లో అక్షర్‌ పటేల్ (1) కూడా వికెట్ల ముందు దొరికిపోయాడు. హర్‌ప్రీత్‌ వేసిన 11వ ఓవర్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ మనీశ్ పాండే (0) క్లీన్‌బౌల్డ్ కావడంతో మ్యాచ్‌ పంజాబ్‌ చేతుల్లోకి వచ్చేసింది. కాసేపు పోరాడిన అమన్ ఖాన్‌, ప్రవీణ్‌లను ఎల్లిస్‌ తన వరుస ఓవర్లలో పెవిలియన్‌కు పంపాడు. 

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్‌సిమ్రన్‌ సిమ్రన్‌ ఒక్కడే శతకంతో రాణించగా.. సామ్‌ కరన్ (20) ఫర్వాలేదనిపించాడు. శిఖర్ ధావన్ (7), లివింగ్‌స్టోన్ (4), జితేశ్ శర్మ (5), హర్‌ప్రీత్‌ బ్రార్‌ (2), షారూక్ ఖాన్‌ (2) ఘోరంగా విఫలమయ్యారు. సికిందర్‌ రజా (11*) పరుగులు చేశాడు. దిల్లీ బౌలర్లలో ఇషాంత్‌ శర్మ 2, ముఖేశ్‌ కుమార్, కుల్‌దీప్‌ యాదవ్, ప్రవీణ్ దూబె, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు