పంజాబ్‌ హ్యాట్రిక్‌: దుమ్ము రేపిన పూరన్‌

హమ్మయ్య..! పంజాబ్‌ హ్యాట్రిక్‌ కొట్టింది. కాస్త టెన్షన్‌ పెట్టినా.. వరుసగా మూడో విజయం సాధించింది. ప్లేఆఫ్‌ అవకాశాలను సజీవంగానే ఉంచుకుంది. దిల్లీ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది....

Published : 21 Oct 2020 01:24 IST

రాహుల్‌ సేన ప్లేఆఫ్ ఆశలు సజీవం

గబ్బర్‌ శతకం వృథా

దుబాయ్‌: హమ్మయ్య..! పంజాబ్‌ హ్యాట్రిక్‌ కొట్టింది. కాస్త టెన్షన్‌ పెట్టినా.. వరుసగా మూడో విజయం సాధించింది. ప్లేఆఫ్‌ అవకాశాలను సజీవంగానే ఉంచుకుంది. దిల్లీ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని మరో 6 బంతులుండగానే విజయవంతంగా ఛేదించింది. 8 పాయింట్లతో పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంది. నికోలస్‌ పూరన్‌ (53; 28 బంతుల్లో 6×4, 3×6), మాక్స్‌వెల్‌ (32; 24 బంతుల్లో 3×4), క్రిస్‌గేల్‌ (29; 13 బంతుల్లో 3×4, 2×6) రాణించడంతో శిఖర్‌ ధావన్‌ (106*; 61 బంతుల్లో 12×4, 3×6) అద్భుత శతకం వృథా అయింది.

ఆరంభంలో తికమక

నిజానికి పంజాబ్‌ ఛేదన ఆరంభంలో గందరగోళంగా సాగింది. తొలి ఓవర్లో భారీ సిక్సర్‌ బాదిన కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (15; 11 బంతుల్లో 1×4, 1×6) జట్టు స్కోరు 17 వద్ద ఔటయ్యాడు. అయితే క్రీజులోకి వచ్చిన క్రిస్‌గేల్‌ యువ పేసర్‌ తుషార్‌ దేశ్‌పాండే వేసిన 5 ఓవర్‌ను లక్ష్యంగా ఎంచుకున్నాడు. వరుసగా 4, 4, 6, 4, 6 బాదేసి స్కోరు బోర్డును 50/1తో నిలిపాడు. ఆ తర్వాతి ఓవర్లోనే గేల్‌ను అశ్విన్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. పూరన్‌ సమన్వయ లోపంతో మయాంక్‌ (5) రనౌట్‌ అవ్వడమే కాకుండా గాయపడ్డాడు. మాక్స్‌వెల్‌తోనూ సమన్వయ లోపం తలెత్తినా.. అతడు వారించడంతో పూరన్‌ రనౌట్‌ ప్రమాదం తప్పించుకున్నాడు. 

పూరన్‌..సైరన్‌

56 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన పంజాబ్‌ గెలుపుపై కాసేపు అనుమానాలు కమ్మేశాయి. అయితే నికోలస్‌ పూరన్‌ వాటిని పటాపంచలు చేశాడు. మాక్స్‌వెల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 69 పరుగుల భారీ భాగస్వామ్యం అందించాడు. అద్భుతమైన బౌండరీలు.. కళ్లు చెదిరే సిక్సర్లతో చెలరేగాడు. తుషార్‌ వేసిన 9వ ఓవర్లో 6, 4, 4 దంచేశాడు. దాంతో పంజాబ్‌ 10 ఓవర్లకు 101/3తో నిలిచింది. ఆ తర్వాతా పూరన్‌ అదే జోరు కొనసాగించాడు. రబాడా వేసిన 12.2వ బంతికి బౌండరీ బాది అర్ధశతకం అందుకున్నాడు. ఆ తర్వాత బంతికే విచిత్రంగా పంత్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఈ క్రమంలో మాక్సీ నిలకడగా ఆడి రన్‌రేట్‌ను అదుపులోనే ఉంచాడు. చివర్లో భారీ షాట్లు ఆడబోయి ఔటైనా.. సమీకరణం 18 బంతుల్లో 14గా ఉండటం.. దీపక్‌ హుడా (15*; 22 బంతుల్లో 1×4), జేమ్స్‌ నీషమ్‌ (10*; 8 బంతుల్లో 1×6) నిలకడగా ఆడటంతో పంజాబ్‌ ఊపిరి పీల్చుకుంది.

గబ్బర్‌ గర్జన

అంతకు ముందు గబ్బర్‌.. మళ్లీ గర్జించాడు. ఫామ్‌లో ఉంటే తననెవ్వరూ ఆపలేరని మరోసారి నిరూపించాడు. ఐపీఎల్‌ చరిత్రలో వరుసగా రెండు సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా అవతరించాడు. తన సహచరులు బంతిని టైమింగ్‌ చేసేందుకే ఇబ్బంది పడుతున్న పిచ్‌పై వరుస బౌండరీలు, భారీ సిక్సర్లతో దుమ్మురేపాడు. పంజాబ్‌తో పోరులో ‘స్మార్ట్‌ క్రికెట్‌’తో అలరించాడు. 61 బంతుల్లోనే 12 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. దిల్లీల్లో మిగతా బ్యాటర్లు 59 బంతుల్లో చేసింది 58 పరుగులే. అయినా ఆ జట్టు 20 ఓవర్లకు 164/5తో నిలిచిందంటే కారణం శిఖర్ ధావన్‌. జట్టు స్కోరు 25 వద్దే పృథ్వీ షా (7)ను నీషమ్‌ ఔట్‌ చేసినా శ్రేయస్‌‌ (14)తో కలిసి విజృంభించాడు. పవర్‌ప్లే ముగిసే సరికి జట్టును 53/1తో నిలిపాడు. ఒకవైపు ధావన్‌ దూకుడుగా ఆడుతున్నప్పటికీ  శ్రేయస్, రిషభ్ పంత్‌ (14), స్టాయినిస్‌ (9) విఫలమయ్యారు. పంజాబ్‌ బౌలర్లు విజృంభించడంతో దిల్లీ స్కోరు వేగం తగ్గింది. పడిపోతున్న రన్‌రేట్‌ను పెంచేందుకు అర్ధశతకం తర్వాత గబ్బర్‌ గేరు మార్చాడు. ఓవర్‌కు ఓ బౌండరీ చొప్పున సాధించాడు. 57 బంతుల్లోనే శతకం అందుకొని 18.4 ఓవర్లకు దిల్లీ స్కోరును 150కి చేర్చాడు. ఆఖరి ఓవర్లో షమి చక్కని యార్కర్లతో విరుచుకుపడి 7 పరుగులిచ్చి వికెట్‌ తీయడంతో శ్రేయస్‌ సేన 164/5కు పరిమితం అయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని