Rajapaksa : లంక క్రికెట్‌ బోర్డు వల్లే రిటైర్మెంట్‌పై వెనక్కి: రాజపక్స

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం వెనుక..

Published : 02 Apr 2022 14:52 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం వెనుక ఏం జరిగిందనే విషయాలను శ్రీలంక ఆటగాడు,  పంజాబ్‌ బ్యాటర్ భానుక రాజపక్స వెల్లడించాడు. శ్రీలంక క్రికెట్‌ బోర్డే తనను రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సూచించిందని తెలిపాడు. ప్రస్తుత టీ20 లీగ్‌ సీజన్‌లో పంజాబ్‌ తరఫున రెండు మ్యాచుల్లో 238.70 స్ట్రైక్‌ రేట్‌తో 75 పరుగులు చేశాడు. అందులోనూ గత మ్యాచ్‌లో (కోల్‌కతాపై) కేవలం 9 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో 137 పరుగులకే పంజాబ్‌ పరిమితమైంది. రస్సెల్ (31 బంతుల్లో 70 నాటౌట్‌: 2 ఫోర్లు, 8 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో కేవలం 14.3 ఓవర్లలోనే నాలుగు వికెట్లను కోల్పోయి 141 పరుగులు చేసి విజయం సాధించింది. 

‘‘శ్రీలంక క్రికెట్ బోర్డు చెప్పడం వల్లే రిటైర్మెంట్ పత్రాన్ని వెనక్కి తీసుకున్నా. దేశం కోసం సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నా. ప్రస్తుతం ఫిట్‌నెస్‌ బాగానే ఉంది. రన్నింగ్‌ కూడా చేయగలగుతున్నా. మొన్నటి వరకు దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు అవసరమైన ఫిట్‌నెస్‌ను సాధించలేకపోయా. దాదాపు నాలుగు నెలలపాటు ఆటకు దూరంగా ఉన్నా. లంక తరఫున ఆసీస్‌, భారత పర్యటనలకు దూరమయ్యా. డైరెక్ట్‌గా టీ20 లీగ్‌లోనే ఆడుతున్నా. అయితే రెండు మ్యాచుల్లోనూ దూకుడుగా పరుగులు చేయడంతో నా బ్యాటింగ్‌పై విశ్వాసం పెరిగింది’’ అని రాజపక్స వివరించాడు. భారీ లక్ష్యం ఉంచాలని ముందే అనుకున్నామని, అయితే ఉమేశ్ యాదవ్‌ వల్ల మా ప్రణాళికలు పారలేదని చెప్పాడు. కోల్‌కతా టీమ్‌ చాలా బలంగా ఉందని, మరీ ముఖ్యంగా ఆండ్రూ రస్సెల్‌ వంటి డేంజరస్‌ బ్యాటర్‌ను ఆపడం చాలా కష్టమని రాజపక్స పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని