దంచికొట్టిన పొలార్డ్‌.. పంజాబ్‌ లక్ష్యం 177

ఆఖరి ఓవర్లలో పొలార్డ్‌ (34*; 12 బంతుల్లో, 1×4, 4×4), కౌల్టర్‌నైల్‌ (24*, 12 బంతుల్లో, 4×4) దంచికొట్టడంతో పంజాబ్‌కు ముంబయి 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 

Updated : 18 Oct 2020 21:22 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఆఖరి ఓవర్లలో పొలార్డ్‌ (34*; 12 బంతుల్లో, 1×4, 4×4), కౌల్టర్‌నైల్‌ (24*, 12 బంతుల్లో, 4×4) దంచికొట్టడంతో పంజాబ్‌కు ముంబయి 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రోహిత్‌సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. పంజాబ్‌ బౌలర్ల ధాటికి ముంబయి పవర్‌ప్లేలో 43 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోహిత్‌ శర్మ (9), సూర్యకుమార్ (0), ఇషాన్‌ కిషన్‌ (7) విఫలమయ్యారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన కృనాల్ పాండ్య (34; 30 బంతుల్లో, 4×4, 1×6)తో కలిసి ఓపెనర్‌ డికాక్‌ (53; 43 బంతుల్లో, 3×4, 3×6) ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే దూకుడుగా ఆడే క్రమంలో కృనాల్‌ వెనుదిరిగాడు.

మరోవైపు నిలకడగా ఆడుతున్న డికాక్‌ 39 బంతుల్లో అర్ధశతకాన్ని సాధించాడు. అయితే హార్దిక్‌ పాండ్య (8)ను షమి, డికాక్‌ను జోర్డాన్‌ వరుస ఓవర్లలో పెవిలియన్‌కు పంపించి ఆ జట్టును మరోసారి దెబ్బ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కౌల్డర్‌నైల్‌తో కలిసి పొలార్డ్‌ చెలరేగాడు. అర్షదీప్ వేసిన 18వ ఓవర్‌లో పొలార్డ్‌ రెండు సిక్సర్లు, నైల్‌ రెండు ఫోర్‌లు బాదారు. వీరిద్దరి ధాటికి ఆఖరి మూడు ఓవర్లలో 54 పరుగులు వచ్చాయి. పంజాబ్‌ బౌలర్లలో షమి, అర్షదీప్‌ చెరో రెండు వికెట్లు, జోర్డాన్‌, బిష్ణోయ్‌ చెరో వికెట్ తీశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని