పంజాబ్‌ పంజా: హైదరాబాద్‌ ఇంటికే!

వారెవ్వా.. పంజాబ్‌! లీగ్‌ రెండో అర్ధభాగంలో దుమ్మురేపుతోంది. వరుసగా నాలుగో విజయం సాధించింది. 127 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్‌ను 114కే కుప్పకూల్చింది. 12 పరుగుల తేడాతో విజయం...

Updated : 25 Oct 2020 04:36 IST

12 పరుగుల తేడాతో హైదరాబాద్‌పై పంజాబ్‌ విజయం

అబుదాబి: వారెవ్వా.. పంజాబ్‌! లీగ్‌ రెండో అర్ధభాగంలో దుమ్మురేపుతోంది. వరుసగా నాలుగో విజయం సాధించింది. 127 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్‌ను 114కే కుప్పకూల్చింది. 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా లేని పిచ్‌పై డేవిడ్‌ వార్నర్‌ (35; 20 బంతుల్లో 3×4, 2×6), విజయ్‌ శంకర్‌ (25; 25 బంతుల్లో 4×4) పోరాటం సరిపోలేదు.  అంతకు ముందు పంజాబ్‌లో నికోలస్‌ పూరన్‌ (32; 28 బంతుల్లో 2×4), కేఎల్‌ రాహుల్‌ (27; 27 బంతుల్లో 2×4, 1×6), క్రిస్‌ గేల్‌ (20; 20 బంతుల్లో 2×4, 1×6) ఫర్వాలేదనిపించారు.

అర్షదీప్‌, జోర్డాన్‌ అద్భుతం

మోస్తారు లక్ష్యఛేదనకు దిగిన హైదరాబాద్‌కు శుభారంభమే దక్కింది. డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో (19; 20 బంతుల్లో 4×4) తొలి వికెట్‌కు 56 పరుగుల భాగస్వామ్యం అందించారు. వీరిద్దరూ దూకుడుగా ఆడుతుండటంతో హైదరాబాద్‌ విజయం దిశగా కదలినట్టే అనిపించింది. అయితే రెండు పరుగుల వ్యవధిలో వార్నర్‌ను బిష్ణోయ్‌, బెయిర్‌స్టోను మురుగన్‌ అశ్విన్‌ పెవిలియన్‌ పంపించారు. అబ్దుల్‌ సమద్‌ (7) త్వరగానే ఔటయ్యాడు. ఈ క్రమంలో విజయ్ శంకర్‌ (26), మనీశ్‌పాండే (15) నిలకడగా ఆడుతూ నాలుగో వికెట్‌కు 33 పరుగుల భాగస్వామ్యం అందించారు. సునాయసంగా సింగిల్స్‌ తీస్తుండటంతో వీరిద్దరూ మ్యాచ్‌ను గెలిపిస్తారనే అనుకున్నారు. అయితే జట్టు స్కోరు 100 వద్ద పాండేను జోర్డాన్‌ (3/17), 110 వద్ద శంకర్‌ను అర్షదీప్‌ (3/23) ఔట్‌ చేయడంతో హైదరాబాద్‌కు షాక్‌ తగిలింది. ఆ తర్వాత జేసన్‌ హోల్డర్‌ (5), రషీద్‌ ఖాన్‌ (0), సందీప్ శర్మ (0) వెంటవెంటనే పెవిలియన్‌ చేరారు. డేవిడ్‌ సేన 14 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు చేజార్చుకుంది. ఆఖరి ఓవర్లో 14 పరుగులను అర్షదీప్‌ డిఫెండ్‌ చేశాడు. కేవలం ఒక పరుగే ఇచ్చి ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసేశాడు.

రక్షించిన పూరన్‌

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ పవర్‌ప్లేలో ఫర్వాలేదనిపించింది. 37 వద్ద మన్‌దీప్‌ సింగ్‌ (17; 14 బంతుల్లో 1×4) ఔటైనా 6 ఓవర్లకు 47/1తో నిలిచింది. క్రిస్‌గేల్‌, రాహుల్‌ జోరుగా ఆడుతుండటంతో పంజాబ్‌ భారీ స్కోరు చేస్తుందనిపించింది. అయితే 66 వద్ద గేల్‌ను హోల్డర్‌, రాహుల్‌ను రషీద్‌ఖాన్‌ పెవిలియన్‌ పంపించి భారీ దెబ్బకొట్టడంతో పంజాబ్‌కు వరుస షాకులు తగిలాయి. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై హైదరాబాద్‌ బౌలర్లు మరింత విజృంభించారు. కట్టుదిట్టమైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో దుమ్మురేపారు. పంజాబ్‌ బ్యాటర్లను వణికించారు. భారీ హిట్టర్‌ నికోలస్‌ పూరన్‌ సైతం షాట్లు ఆడలేకపోయాడు. ఆఖరి వరకు అతడు ఒంటరిగా పోరాడుతున్నా  మాక్స్‌వెల్‌ (12; 13 బంతుల్లో), దీపక్‌ హుడా (0; 2 బంతుల్లో), క్రిస్‌ జోర్డాన్‌ (7; 12 బంతుల్లో), మురుగన్‌ అశ్విన్‌ (4; 4 బంతుల్లో) వరుసగా పెవిలియన్‌ చేరడంతో పంజాబ్‌ 126/7కు పరిమితమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని