Virat Kohli: కోహ్లీ నీ వికెట్‌ ఆస్వాదించాం కానీ.. త్వరలోనే నీ లక్‌ మారుతుంది: పంజాబ్‌

బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ వికెట్‌ ఆస్వాదించామని, అయితే.. త్వరలోనే అతడి లక్‌ మారుతుందని పంజాబ్‌ టీమ్‌ ఆశాభావం వ్యక్తం చేసింది...

Published : 15 May 2022 01:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బెంగళూరు మాజీ సారథి విరాట్‌ కోహ్లీ వికెట్‌ తీయడాన్ని ఆస్వాదించామని, అయితే.. త్వరలోనే అతడి లక్‌ మారుతుందని పంజాబ్‌ టీమ్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. శుక్రవారం రాత్రి బెంగళూరు జట్టు.. పంజాబ్‌తో తలపడిన సందర్భంగా కోహ్లీ (20) మరోసారి తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరి తీవ్రంగా నిరాశపర్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈసారి వికెట్‌ కోల్పోయాక విరాట్‌ సైతం తన వైఫల్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. 210 పరుగుల భారీ ఛేదనలో ధాటిగా ఆరంభించిన కోహ్లీ.. రబాడ వేసిన 3.2 ఓవర్‌కు ఔటయ్యాడు. దీంతో అతడు క్రీజు వదిలి వెళ్లే ముందు రెండు చేతులూ పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ కనిపించాడు.

అనంతరం తనలో తానే ఏదో అరుచుకుంటూ మైదానం వీడాడు. దీన్ని బట్టి అతడెంత అసహనానికి గురయ్యాడో అర్థం చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం పంజాబ్‌ టీమ్‌ తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో కోహ్లీ ఆకాశంవైపు చూస్తున్న ఫొటోను పంచుకొని ఓ పోస్టు చేసింది. అందులో.. తాము కాసేపు కోహ్లీ వికెట్‌ ఆస్వాదించామని కూడా చెప్పింది. అయితే, ఫామ్‌ కోల్పోయి తంటాలు పడుతున్న అతడు త్వరలోనే తిరిగి పుంజుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, విరాట్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో 19.67 సగటుతో 236 పరుగులే చేశాడు. అందులో ఒకే ఒక్క అర్ధశతకం సాధించాడు. దీంతో అతడి ఆటతీరుపై అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని