PV Sindhu: పతాకధారి సింధు

భారత స్టార్‌ షట్లర్‌ పూసర్ల వెంకట సింధు మరోసారి ఒలింపిక్స్‌లో పతాకధారిగా వ్యవహరించనుంది. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు (రియోలో రజతం, టోక్యోలో కాంస్యం) సాధించిన ఈ తెలుగమ్మాయి.. పారిస్‌ ఒలింపిక్స్‌లో త్రివర్ణ పతాకాన్ని చేబూని భారత బృందాన్ని నడిపించనుంది.

Published : 09 Jul 2024 02:43 IST

పారిస్‌ ఒలింపిక్స్‌ చెఫ్‌ డి మిషన్‌గా గగన్‌
దిల్లీ

భారత స్టార్‌ షట్లర్‌ పూసర్ల వెంకట సింధు మరోసారి ఒలింపిక్స్‌లో పతాకధారిగా వ్యవహరించనుంది. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు (రియోలో రజతం, టోక్యోలో కాంస్యం) సాధించిన ఈ తెలుగమ్మాయి.. పారిస్‌ ఒలింపిక్స్‌లో త్రివర్ణ పతాకాన్ని చేబూని భారత బృందాన్ని నడిపించనుంది. పురుషుల తరఫున టేబుల్‌ టెన్నిస్‌ దిగ్గజం శరత్‌ కమల్‌ పతాకధారిగా వ్యవహరించనున్నాడు. హైదరాబాదీ మాజీ షూటర్, లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య విజేత గగన్‌ నారంగ్‌.. పారిస్‌ క్రీడల్లో భారత బృందానికి చెఫ్‌ డి మిషన్‌గా వ్యవహరించనున్నాడు. ముందు మేరీ కోమ్‌ ఈ పదవికి ఎంపికైనప్పటికీ.. ఆమె వ్యక్తిగత కారణాలతో తప్పుకోవడంతో ప్రత్యామ్నాయం చూడక తప్పలేదు. ‘‘మేరీ స్థానంలో ఒలింపిక్‌ పతకం గెలిచిన యువ అథ్లెట్‌ కోసం నేను చూస్తుండగా.. మా సహచరులు గగన్‌ పేరు సూచించారు. అతను మేరీకి సరైన ప్రత్యామ్నాయం. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన ఏకైక మహిళా అథ్లెట్‌ అయిన సింధు, దిగ్గజ టీటీ ఆటగాడు శరత్‌ కమల్‌ పారిస్‌లో పతాకధారులుగా వ్యవహరిస్తారు’’ అని భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష తెలిపింది. శరత్‌ను మార్చిలోనే పతాకధారిగా ప్రకటించగా.. మహిళల నుంచి పతాకధారిగా సింధును తాజాగా ఎంపిక చేశారు. ఒకప్పుడు జట్టు మొత్తానికి ఒకరే పతాకధారి ఉండేవారు. 2020లో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ ఒక మహిళ, ఒక పురుషుడు పతాకధారులుగా వ్యవహరించేలా నిబంధనలు మార్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని