IPL MI: నా ఆలోచనలన్నీ భారత ప్రజలపైనే

ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఇలా అర్ధాంతరంగా వాయిదాపడటంపై ముంబయి ఇండియన్స్‌ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ సతీమణి సాషాహర్లీ విచారం వ్యక్తం చేశారు. ఇటీవల భారత్‌లో నిర్వహించిన...

Published : 10 May 2021 01:07 IST

టోర్నీ వాయిదాపై క్వింటన్‌ డికాక్‌ సతీమణి

(Photo: Sasha Dekock Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఇలా అర్ధాంతరంగా వాయిదాపడటంపై ముంబయి ఇండియన్స్‌ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ సతీమణి సాషా హర్లీ విచారం వ్యక్తం చేశారు. ఇటీవల భారత్‌లో నిర్వహించిన మెగా ఈవెంట్‌లో బయోబుడగలోని పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దాంతో మిగిలిన మ్యాచ్‌లను నిరవధికంగా వాయిదా వేశారు. ఈ క్రమంలోనే అన్ని ఫ్రాంఛైజీల ఆటగాళ్లు తమ ఇళ్లకు వెళ్లిపోగా విదేశీ ఆటగాళ్లు సైతం ఇంటిముఖం పట్టారు. ఒక్క ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాత్రం ప్రయాణ ఆంక్షల కారణంగా మాల్దీవుల్లో సేదతీరుతున్నారు.

అయితే, డికాక్‌ కుటుంబం ఇంటికి చేరిన నేపథ్యంలో సతీమణి సాషా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ పోస్టు పెట్టారు. ‘ఇంత త్వరగా ముంబయి ఇండియన్స్‌ కుటుంబాన్ని వీడటం చాలా బాధగా ఉంది. అక్కడ కలిసిన కొత్త, పాత మహిళ స్నేహితురాళ్లను (ఆటగాళ్ల భార్యలు) మిస్‌ అవుతున్నా. ఈ విపత్కర పరిస్థితుల్లో నా ఆలోచనలన్నీ భారత ప్రజలపైనే ఉన్నాయి. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అని సాషా పలు ఫొటోలు పంచుకుంది. కాగా, ఈ సీజన్‌లో డికాక్‌ ఆరు మ్యాచ్‌లాడి 155 పరుగులు చేశాడు. అందులో ఒక అర్ధ సెంచరీ సాధించాడు. మరోవైపు ముంబయి ఇండియన్స్‌ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని