Ashwin: పాక్‌ క్రికెట్ బోర్డు వ్యాఖ్యలకు అశ్విన్‌ ఘాటు స్పందన!

భారత్ - పాకిస్థాన్ (IND vs AUS) మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్‌లు లేవు. అలాగే పాక్‌లో జరిగే టోర్నీలను కూడా వేరే చోటుకు మార్చేస్తుంటారు. భారత్‌ ఎలాగూ అక్కడికి పోదు. సంపద, ఆటపరంగా పెద్ద జట్టు లేకుండా టోర్నీ విజయవంతం కావడం కష్టం. ఇప్పుడు ఆసియా కప్‌ 2023 (Asia Cup 2023) విషయంలోనూ అదే పరిస్థితి ఎదురైంది.  

Published : 07 Feb 2023 12:14 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా కప్‌ 2023 (Asia Cup 2023) టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించి వివాదం కొనసాగుతూనే ఉంది. పాకిస్థాన్‌లో టీమ్‌ఇండియా ఆసియా కప్‌ ఆడకపోతే.. భారత్‌ వేదికగా జరిగే  వన్డే ప్రపంచకప్‌లో పాక్‌ ఆడేదిలేదని ఆ జట్టు క్రికెట్ బోర్డు ఛైర్మన్‌ నజామ్ సేథీ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. ఆసియా కప్‌ కౌన్సిల్ (ACC) సమావేశంలో  జై షా (Jay Shah)తో నజామ్ సేథీ చెప్పినట్లు కూడా పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. తాజాగా పాక్‌ క్రికెట్ బోర్డు (PCB) తీరుపై టీమ్‌ఇండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఘాటుగా స్పందించాడు. వన్డే ప్రపంచకప్‌ను ఆడకుండా పాక్‌ వదిలేస్తుందని అనుకోవడం లేదని వ్యాఖ్యానించాడు. 

‘‘పాకిస్థాన్‌ వేదికగా ఆసియా కప్‌ను నిర్వహిస్తే.. పాక్‌లో ఆడేదిలేదని టీమ్‌ఇండియా ప్రకటించింది. కాబట్టి, మేం పాల్గొనేది లేదు. ఒకవేళ భారత్‌ ఆడాలని భావిస్తే మాత్రం ఆసియా కప్‌ వేదికను మార్చాలి. అయితే, ఇలా చాలాసార్లు జరిగిందనే చెప్పాలి. ఆసియా కప్‌ అక్కడ నిర్వహించొద్దని మేం చెప్పాం. అలాగే వాళ్లు ఇక్కడకు వచ్చేది లేదని చెబుతూనే ఉన్నారు. కానీ, వరల్డ్ కప్‌లో పాక్‌ ఆడకుండా ఉండటం మాత్రం అసాధ్యం. ఇక టోర్నీ నిర్వహణకు సంబంధించి తుది నిర్ణయం ఏసీసీదే. అయితే, యూఏఈకి బదులు శ్రీలంకకు తరలిస్తే బాగుంటుంది. భారత్‌లో జరిగే వన్డే ప్రపంచ కప్‌ టోర్నీకి కూడా కాస్త దోహదపడుతుంది. ఇప్పటికే చాలా టోర్నమెంట్‌లు యూఏఈ వేదికగా నిర్వహించారు. ఈసారి యూఏఈకి బదులు శ్రీలంకకు తరలిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం’’ అని అశ్విన్‌ తెలిపాడు. సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్‌ వేదికపై మార్చిలో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని