Ashwin: భారత టెస్టు జట్టు కెప్టెన్సీకి అశ్విన్‌ అర్హుడు: డానిష్ కనేరియా

భారత టెస్టు కెప్టెన్సీకి అన్ని విధాలా అర్హత కలిగిన వ్యక్తి రవిచంద్రన్‌ అశ్విన్‌ అని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా అన్నాడు.

Published : 27 Dec 2022 01:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత టెస్టు కెప్టెన్సీకి అన్ని విధాలా అర్హత కలిగిన వ్యక్తి రవిచంద్రన్‌ అశ్విన్‌ అని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా అన్నాడు. మిర్పూర్‌ టెస్టులో బంగ్లాదేశ్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌ను అతడు విజయతీరాలకు చేర్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత టెస్టు కెప్టెన్సీకి అశ్విన్‌ కూడా మంచి ఎంపిక అవుతాడని కనేరియా అభిప్రాయపడ్డాడు.  బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనూ చురుగ్గా రాణించగలడని ప్రశంసించాడు. 

‘‘భారత టెస్టు కెప్టెన్సీకి అన్ని విధాలా అర్హత కలిగిన వ్యక్తుల్లో రవిచంద్రన్‌ అశ్విన్‌ ఒకరు. అతనిలో ఇంకా చాలా క్రికెట్‌ దాగి ఉంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అతడి తెలివితేటలు, చురుకుదనం అద్భుతం. మైదానంలో ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తాడు.  భారత్‌ ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా అశ్విన్‌ ప్రశాంతంగా ఉన్నాడు. కష్టకాలంలో గొప్ప ఇన్నింగ్స్‌ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. చాలా సందర్భాల్లో తన బ్యాటింగ్‌తో అశ్విన్‌ భారత్‌ను గట్టెక్కించాడు. గతంలో అనిల్‌కుంబ్లే లేకుండా ఆడినప్పుడు భారత్‌ బలహీనంగా కనిపించింది. ఇప్పుడు అశ్విన్‌ విషయంలోనూ అదే జరుగుతోంది. అతడు చేసిన 42 పరుగులు సెంచరీతో సమానం’’ అని అశ్విన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు కనేరియా.

ఆ క్యాచ్‌ వదిలేయడంతో..

బంగ్లా ఫీల్డర్‌ మోమినుల్‌ హక్‌ గొప్ప ఫీల్డర్‌ కానీ అతడు అశ్విన్‌ క్యాచ్‌ వదిలేసి భారత్‌కు విజయాన్ని బహుమతిగా ఇచ్చాడని కనేరియా అన్నాడు. ‘‘మోమినుల్‌ హక్‌ గొప్ప ఫీల్డర్‌. అతడు ఎన్నో అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్నాడు. కానీ బంగ్లాకు కీలకమైన దశలో అశ్విన్‌ క్యాచ్‌ను మాత్రం వదిలేశాడు. కీలక దశలో క్యాచ్‌ వదిలేయడం భారత్‌కి వరంగా మారింది’’ అని కనేరియా అన్నాడు.

అఫ్రిదిపై సంచలన ట్వీట్..

పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిదిని సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) నియమించిన విషయం తెలిసిందే.  అఫ్రిది నియామకంపై డానిష్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. బాల్‌ టాంపరింగ్‌కి పాల్పడిన వ్యక్తి చీఫ్‌ సెలెక్టర్‌గా నియమితులయ్యారని అర్థం వచ్చేలా ‘బంతిని కొరుకుతున్న అఫ్రిది’ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని