Rafael Nadal : అయ్యో మెద్వెదెవ్‌.. నాదల్ చేతిలో మరోసారి భంగపాటు

పాపం రష్యన్‌ టెన్నిస్‌ ఆటగాడు డానీ మెద్వెదెవ్‌కు నాదల్‌ ఫీవర్‌ కొనసాగుతూనే...

Published : 27 Feb 2022 01:49 IST

మెక్సికో ఓపెన్‌ సెమీస్‌లో ప్రపంచనంబర్‌వన్‌ ఓటమి

ఇంటర్నెట్ డెస్క్‌: పాపం రష్యన్‌ టెన్నిస్‌ ఆటగాడు, ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకర్‌ డానీ మెద్వెదెవ్‌కు రఫేల్‌ నాదల్‌ ఫీవర్‌ కొనసాగుతూనే ఉంది. హోరాహోరీగా సాగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌లో ‘స్పెయిన్‌ బుల్’ నాదల్‌ చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచిన మెద్వెదెవ్‌కు మరోసారి భంగపాటు తప్పలేదు. ఏటీపీ మెక్సికో ఓపెన్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో మెద్వెదెవ్‌పై రఫేల్ నాదల్ 6-3, 6-3 తేడాతో అలవోకగా విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. దీంతో 2022 సీజన్‌లో విజయాలపరంగా 14-0 రికార్డుతో నాదల్ కొనసాగుతున్నాడు. ఇప్పటికే అందరి కంటే అత్యధికంగా 21 గ్రాండ్‌స్లామ్‌లను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌లో నాదల్‌ను ప్రతిఘటించిన మెద్వెదెవ్ మెక్సికో ఓపెన్‌లో మాత్రం తేలిపోయాడు. మొదటి సెట్‌ను 6-3తో చేజార్చుకున్న రష్యన్‌ ప్లేయర్‌ రెండో సెట్‌ ఆరంభంలో మాత్రం కాస్త దూకుడు ప్రదర్శించాడు. నాదల్ బ్రేక్‌ పాయింట్‌ను మెద్వెదెవ్‌ బ్రేక్‌ చేసినా చివరి వరకు ఆధిక్యత కొనసాగించలేకపోయాడు. సీనియర్ ఆటగాడు నాదల్ తన అనుభవాన్ని ఉపయోగించి వరుసగా నాలుగు బ్రేక్‌ పాయింట్లతో సెట్‌ను దక్కించుకున్నాడు. దీంతో రెండో సెట్‌నూ 6-3తో ఓడిపోయిన మెద్వెదెవ్‌ ఇంటిముఖం పట్టాడు. ‘‘బ్రేక్‌ పాయింట్ల దక్కించుకునేటప్పుడు  కొన్ని అద్భుతమైన షాట్లు కొట్టగలిగాను. ఇక రెండో సెట్‌ అయితే కాస్త ఎమోషన్‌కు గురయ్యా. మెద్వెదెవ్ దూకుడుగా సెట్‌ను ప్రారంభించాడు. అందుకే ఇది కొంచెం కష్టంగా అనిపించింది’’ అని నాదల్ వివరించాడు. తుదిపోరులో దక్షిణాఫ్రికా ఆటగాడు కామెరూన్‌ నారీతో రఫేల్‌ నాదల్ తలపడతాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని