Rafael Nadal: చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో రఫెల్‌ నాదల్‌

ఆస్ట్రేలియా ఓపెన్‌లో విజయం సాధించి 21వ సారి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ అందుకొని చరిత్ర సృష్టించాలని చూస్తున్న స్పెయిన్‌ దిగ్గజం రఫెల్‌ నాదల్‌ అడుగు దూరంలో నిలిచాడు...

Updated : 28 Jan 2022 14:32 IST

సెమీస్‌లో గెలుపొందిన స్పెయిన్‌ దిగ్గజం

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా ఓపెన్‌లో విజయం సాధించి 21వ సారి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ అందుకొని చరిత్ర సృష్టించాలని చూస్తున్న స్పెయిన్‌ దిగ్గజం రఫెల్‌ నాదల్‌.. ఆ విజయానికి మరో అడుగు దూరంలో ఉన్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్స్‌లో అతడు.. ఇటలీకి చెందిన ఏడో సీడ్‌ బెరెటినీని ఓడించాడు. 2 గంటల 56 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో నాదల్‌ 6-3, 6-2, 3-6, 6-3 తేడాతో గెలుపొందాడు. కాగా, మరో సెమీఫైనల్లో గెలుపొందే విజేతతో అతడు ఆదివారం తుదిపోరులో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఇక రెండో సెమీఫైనల్స్‌లో నాలుగో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)తో రెండో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా) తలపడనున్నాడు. వీరిద్దరు 2021 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సెమీఫైనల్లోనూ పోటీపడటం విశేషం. ప్రస్తుతం నాదల్‌.. రోజర్‌ ఫెదరర్‌, నోవాక్‌ జకోవిచ్‌తో సమానంగా అత్యధికంగా 20 గ్రాండ్‌స్లామ్‌లతో కొనసాగుతున్నాడు. వారిద్దరూ ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడటం లేని కారణంగా నాదల్‌కు చరిత్ర సృష్టించే అద్భుత అవకాశం దక్కింది. అదే జరిగితే మొత్తం నాలుగు గ్రాండ్‌ స్లామ్‌ టైటిళ్లను రెండేసి సార్లు సాధించిన జకోవిచ్‌, రాయ్‌ ఎమర్సన్‌, రాడ్‌ లేవర్‌ సరసన నాలుగో ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. కాగా, ఈ స్పెయిన్‌ దిగ్గజం 2009లో చివరిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో విజేతగా నిలవగా.. ఇప్పుడు ఆరోసారి రికార్డు స్థాయిలో ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫైనల్స్‌కు చేరాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని