Rafael Nadal: ఫ్రెంచ్‌ ఓపెన్‌కు నాదల్‌ దూరం.. వచ్చే ఏడాది చివరిది కావొచ్చన్న ‘క్లే కోర్టు రారాజు’

ఫ్రెంచ్‌ ఓపెన్‌కు రఫేల్‌ నాదల్‌ (Rafael Nadal) దూరం కానున్నాడు. అంతేకాకుండా వచ్చే ఏడాది రిటైర్‌మెంట్‌ తీసుకునే అవకాశం ఉందని చెప్పాడు.

Published : 18 May 2023 23:56 IST

మాడ్రిడ్‌: టెన్నిస్‌ అభిమానులకు చేదువార్త. స్పెయిన్‌ సూపర్‌స్టార్‌ రఫేల్‌ నాదల్‌ (Rafael Nadal) ఫ్రెంచ్‌ ఓపెన్‌కు (French Open) దూరం కానున్నాడు. మే 22 నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీలో తాను ఆడటం లేదని నాదల్‌ ప్రకటించాడు. తుంటి ఎముక సమస్య కారణంగా ఈ టోర్నీకి దూరంగా ఉంటున్నట్లు చెప్పాడు. అంతేకాకుండా 2024లో కెరియర్‌ రిటైర్‌మెంట్‌ తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు తెలిపాడు. ‘‘ఇది నేను తీసుకున్న నిర్ణయం కాదు. నా శరీరం తీసుకున్న నిర్ణయం. నా టెన్నిస్‌ కెరియర్‌లో 2024 ఆఖరి సంవత్సరం కావొచ్చు. అలాగని 100 శాతం కచ్చితంగా చెప్పలేను. ఏం జరుగుతుందో ఎవరూ అంచనా వేయలేరు.’’ అని నాదల్‌ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చాడు.

2005 తర్వాత రఫేల్‌ నాదల్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌కు దూరంగా ఉండటం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు క్లే కోర్టులో 14 టైటిల్స్‌ కైవసం చేసుకున్న నాదల్‌.. 112 మ్యాచ్‌ల్లో విజయం సాధించాడు. కేవలం మూడింట మాత్రమే పరాజయం పాలయ్యాడు. అందులో రెండు మ్యాచ్‌లు నొవాక్‌ జకోవిచ్‌పైనే కావడం గమనార్హం. 2005లో తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నప్పుడు నాదల్‌ వయస్సు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే.  2022లో 14వ టైటిల్‌ గెలిచినప్పటికి అతడి వయస్సు 36 ఏళ్లు. 2003లో 17 ఏళ్ల వయస్సులో వింబుల్డన్‌లో గ్రాండ్ స్లామ్‌తో అరంగేట్రం చేసిన నాదల్‌ ప్యారిస్‌లో తన తొలిప్రదర్శనతో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు