Rafael Nadal : ఆస్ట్రేలియన్‌ ఓపెన్ విజేత నాదల్.. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ల వీరుడిగా రికార్డు

స్పెయిన్‌ బుల్‌ నాదల్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో రఫ్పాడించి సరికొత్త చరిత్రను...

Updated : 30 Jan 2022 20:17 IST

మెల్‌బోర్న్‌: స్పెయిన్‌ బుల్‌ నాదల్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో రఫ్పాడించి సరికొత్త చరిత్రను లిఖించాడు. జకోవిచ్‌, రోజర్ ఫెదరర్‌లను దాటుకుని టెన్నిస్‌ ప్రపంచంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లను కైవసం చేసుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ప్రస్తుత ఆస్ట్రేలియన్ ఓపెన్‌ టైటిల్‌తో నాదల్‌ గ్రాండ్‌స్లామ్‌ల సంఖ్య 21కి చేరింది. 2009 తర్వాత మళ్లీ ఇప్పుడే రఫెల్ నాదల్ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను సొంతం చేసుకోవడం విశేషం. సీనియర్‌ ప్లేయర్‌ అయిన నాదల్‌ ముందు మెద్వెదెవ్‌ నిలవలేకపోయాడు. 

ఆఖరి సెట్‌వరకూ హోరాహోరీగా సాగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌లో మెద్వెదెవ్‌పై 2-6, 6-7, 6-4, 6-4, 7-5 తేడాతో రఫెల్‌ నాదల్ విజయం సాధించాడు. దీంతో తన కెరీర్‌లో రెండో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా 21వ గ్రాండ్‌స్లామ్‌ గెలుచుకోవడం విశేషం. తొలి రెండు సెట్లను కోల్పోయిన నాదల్‌.. ఆఖరి మూడు సెట్లలో అసమాన పోరాటం కనబరిచి విజయం సాధించడంతోపాటు టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 

తొలి సెట్‌ను మెద్వెదెవ్‌ దూకుడుగా ఆడి 6-2 తేడాతో గెలుచుకున్నాడు. రెండో సెట్‌లో నాదల్‌ తీవ్రంగా పోరాడినా 6-7తో మెద్వెదెవ్‌ విజయం సాధించాడు. వరుసగా రెండు సెట్లను కోల్పోయిన నాదల్‌ ఎక్కడా తగ్గలేదు. తన అనుభవాన్ని మొత్తం ఉపయోగించి చివరి మూడు సెట్లలో (6-4, 6-4, 7-5) విజయం సాధించి రికార్డు నమోదు చేశాడు. ఇద్దరూ చెరో రెండు సెట్లను గెలవడంతో మ్యాచ్‌ ఐదో సెట్‌కు వెళ్లింది. అయితే అక్కడా మెద్వెదెవ్ పట్టువిడవకపోవడంతో నాదల్‌ కాస్త శ్రమ పడాల్సి వచ్చింది. ఓ వైపు నొప్పి వెంటాడుతున్నా ఏమాత్రం లెక్క చేయక దాదాపు ఐదున్నర గంటలపాటు పోరాడటం విశేషం. ఇప్పటి వరకు ఐదు సార్లు వీరిద్దరూ తలపడగా.. ఒక్కసారి మాత్రమే మెద్వెదెవ్ గెలిచాడు. మిగతా నాలుగుసార్లు నాదల్‌ విజయం సాధించాడు.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని