Rahane: ఆ నిర్ణయం తీసుకునేందుకు ద్రవిడ్‌, కోహ్లీ మొగ్గు చూపరేమో! : లక్ష్మణ్‌

కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆటగాడిగా విఫలమైన అజింక్య రహానెకు...

Published : 29 Nov 2021 01:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆటగాడిగా విఫలమైన అజింక్య రహానెకు రెండో టెస్టులో మరొక అవకాశం దక్కొచ్చని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. తొలి టెస్టులో అద్భుతంగా రాణించిన శ్రేయస్‌ అయ్యర్‌కు దురదృష్టవశాత్తూ తుది జట్టులో స్థానం ఉండదేమోనని అంచనా వేశాడు. టీమ్‌ఇండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ జట్టులోకి వస్తుండటంతో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది. అయితే రహానెను తప్పించేందుకు కోచ్‌ ద్రవిడ్, కోహ్లీ మొగ్గు చూపకపోవచ్చన్నాడు. కోహ్లీ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగుతాడని, ఈ క్రమంలో మిడిలార్డర్‌లో పుజారా-రహానెలపైనే ఆధారపడే అవకాశం ఉందని వివరించాడు.  

అయితే కివీస్ మాజీ పేస్‌ బౌలర్‌ సైమన్‌ డౌల్‌ మాత్రం భిన్నంగా స్పందించాడు. ‘‘మొదటి టెస్టులోనే సెంచరీ, హాఫ్ సెంచరీ సాధించిన బ్యాటర్‌ను విస్మరించడం కష్టసాధ్యం. అందుకే ఫామ్‌లో లేని అజింక్య రహానె స్థానంలో కెప్టెన్‌ విరాట్ కోహ్లీ వచ్చే అవకాశం ఉంది. ఆటగాడి మీద నమ్మకం అనేది కొంత సమయం వరకే ఉంటుంది. ఇప్పటివరకు పుజారా, రహానెలపై మేనేజ్‌మెంట్‌ ఎంతో భరోసా కలిగి ఉంది. పుజారా గత 39 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ లేకుండానే మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతున్నాడు. రహానె కూడా ఇదే స్థాయి ప్రదర్శన ఇస్తున్నాడు. రహానె సగటు కూడా యాభై నుంచి 40 దిగువకు పడిపోయింది. అందుకే ఈ సారి రహానెను తప్పించే అవకాశం ఉంది ’’ అని తెలిపాడు. 

వృద్ధిమాన్‌ సాహా సూపర్‌ ఫైటర్‌: వీవీఎస్‌

కివీస్‌పై రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత అర్ధశతకం (61 నాటౌట్) సాధించిన కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాను లక్ష్మణ్‌ పొగడ్తలతో ముంచెత్తాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు సభ్యుడైన సాహాతో లక్ష్మణ్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ‘‘సాహా అసాధారణమైన ఫైటర్‌. జట్టు ఆటగాడు’’ అని అభినందించాడు. కీలకమైన సమయంలో రాణించి టీమ్‌ఇండియాను శాసించే స్థాయికి చేర్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని