Dravid: ద్రవిడ్‌కు క్షమాపణలు చెప్పి డిన్నర్‌కి పిలిచిన మాజీ క్రికెటర్‌.. కారణం ఏంటంటే?

టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కి సౌతాఫ్రికా మాజీ ఆటగాడు, బంగ్లాదేశ్ బౌలింగ్‌ కోచ్‌ అలెన్‌ డొనాల్డ్ క్షమాపణలు చెప్పాడు. 1997లో అతడు ఓ వన్డే మ్యాచ్‌లో ద్రవిడ్‌తో దురుసుగా ప్రవర్తించడమే ఇందుకు కారణం. 

Updated : 29 Jun 2023 16:45 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు అలెన్‌ డొనాల్డ్ క్షమాపణలు చెప్పాడు. 1997లో అతడు ఓ వన్డే మ్యాచ్‌లో ద్రవిడ్‌తో దురుసుగా ప్రవర్తించడమే ఇందుకు కారణం. అలెన్‌ క్షమాపణలు చెబుతూ ద్రవిడ్‌ని డిన్నర్‌కి ఆహ్వానించగా.. ద్రవిడ్‌ దానికి అంగీకరించాడు.. కానీ ఓ షరతు పెట్టాడు. 

ప్రస్తుతం బంగ్లాదేశ్ బౌలింగ్‌ కోచ్‌గా ఉన్న అలెన్‌ డొనాల్డ్.. భారత ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో మైదానంలో జరిగిన కొన్ని ఘటనలను గుర్తు చేసుకున్నాడు. 1997లో దక్షిణాఫ్రికా, భారత్‌ల మధ్య జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో ద్రవిడ్‌పై అలెన్‌ స్లెడ్జింగ్‌కి దిగాడు. 
ఈ సంఘటన గురించి అలెన్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ‘నేను మాట్లాడకూడదనుకునే ఒక దారుణమైన సంఘటన డర్బన్‌లో జరిగింది. రాహుల్ ద్రవిడ్, సచిన్ మా బౌలింగ్‌ని సమర్థవంతంగా ఎదుర్కొని అన్ని వైపుల షాట్లు ఆడుతున్నారు. అప్పుడు నేను ద్రవిడ్‌తో కొంచెం దురుసుగా ప్రవర్తించా. కానీ, రాహుల్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు. అతడంటే ఎంతో గౌరవం. నేను రాహుల్‌తో బయటికి వెళ్లి కూర్చొని ఆ రోజు జరిగిన దాని గురించి మళ్లీ అతనికి క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. అతడి వికెట్ కోసం నేనెలా చేసి ఉండాల్సింది కాదు. ఆ రోజు చేసిన పనికి నేనిప్పటికీ క్షమాపణలు చెబుతున్నా. రాహుల్‌ చాలా గొప్ప వ్యక్తి.  మీరు (ద్రవిడ్‌) ఇది వింటే మీతో ఒకరోజు డిన్నర్‌ చేయాలనుకుంటున్నా’ అని అలెన్‌ డొనాల్డ్ చెప్పాడు.

అలెన్‌ డొనాల్డ్ మాట్లాడిన వీడియోని రాహుల్‌ ద్రవిడ్‌ మరో ఇంటర్వ్యూలో చూశాడు. డొనాల్డ్‌ డిన్నర్‌కు ఆహ్వనించడంపై ద్రవిడ్‌ స్పందిస్తూ.. ‘కచ్చితంగా వస్తా. నేను దాని కోసం ఎదురుచూస్తున్నా. బిల్లు మాత్రం అతడే కట్టాలి (నవ్వుతూ)’ అని పేర్కొన్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని