IND vs AUS: ఆసీస్‌తో టెస్టు సిరీస్‌.. దాని మీదనే మేం దృష్టిపెట్టాం: భారత కోచ్ ద్రవిడ్‌

వన్డేలు, టీ20లు చూసిన అభిమానులకు పసందైన క్రికెట్ మజాను (cricket) అందించడానికి భారత్ - ఆసీస్‌ (IND vs AUS) టెస్టు సిరీస్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా (Team India) ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌ మీడియాతో మాట్లాడాడు.

Published : 05 Feb 2023 18:22 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్ - ఆస్ట్రేలియా (IND vs AUS) టెస్టు సిరీస్‌ ప్రారంభానికి మరో నాలుగు రోజుల సమయమే మిగిలి ఉంది. ఇరు జట్లూ తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో టీమ్‌ఇండియా (team india) ప్రధాన కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత దృష్టంతా కేవలం రెండు అంశాలపైనే ఉందని ద్రవిడ్ తెలిపాడు. నాగ్‌పుర్ వేదికగా ఫిబ్రవరి 9వ తేదీ నుంచి తొలి టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ద్రవిడ్ మాట్లాడిన వీడియోను బీసీసీఐ (bcci) తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. 

‘‘ప్రతి ఒక్కరూ ఉత్సాహంతో ఉన్నారు. మళ్లీ టెస్టులు ఆడతుండటం బాగుంది. గత నెలంతా వన్డేలు, టీ20లు ఎక్కువగా ఆడాం. కొంత మంది తెల్ల బంతి క్రికెట్‌ నుంచి టెస్టులకు మారతారు. దాని కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఫీల్డింగ్‌లోనూ కష్టపడుతున్నారు. టెస్టులకు ఇదే కీలకం కానుంది. స్లిప్స్‌లో క్యాచ్‌లను ఒడిసిపట్టుకోవడం చాల ముఖ్యం. అందుకే ఇలాంటి అంశాలపై దృష్టిసారించాం. సుదీర్ఘమైన సెషన్స్‌ మాకు దొరికాయి. కోచింగ్‌ సిబ్బందిగా మాకెంతో ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే గతకొంతకాలంగా విరామం లేకుండా మ్యాచ్‌లను ఆడేశాం. దాదాపు రెండు వారాలు ఖాళీ దొరకడంతో ప్రణాళికలు, సన్నద్ధత కోసం తగినంత సమయం వెచ్చించాం. నెల రోజుల కార్యాచరణను ఈ నాలుగైదు రోజుల్లో చేయడానికి ప్రయత్నిస్తాం’’

‘‘అయితే నా ప్రమాణాలకు నాలుగైదు రోజులు అనేవి స్వల్పమే.  ఎందుకంటే నేనెప్పుడూ సుదీర్ఘంగా జరిగే క్యాంప్‌లనే ఇష్టపడతా. అయినా, ఇప్పుడు మాకు సమయం సరిపోతుంది. తప్పకుండా మా కుర్రాళ్లు సత్ఫలితాలను సాధిస్తారనే నమ్మకం ఉంది’’ అని రాహుల్‌ ద్రవిడ్‌ తెలిపాడు. తొలిసారి 1996-97లో జరిగిన బోర్డర్ - గావస్కర్ ట్రోఫీని (Border-Gavaskar Trophy) భారత్‌ కైవసం చేసుకొంది. అలాగే 2016 - 17, 2018 - 2019, 2020 - 2021 సీజన్‌లో టీమ్‌ఇండియానే (Team India) ట్రోఫీని గెలుచుకొంది. ఇప్పుడు ఈసారి ట్రోఫీని కూడా సొంతం చేసుకొంటే.. నాలుగు టెస్టుల సిరీస్‌ను వరుసగా నాలుగో సారి కూడా సొంతం చేసుకొన్న జట్టుగా భారత్‌ అవతరించే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని